Dharmaram | ధర్మారం, జూన్ 16: ట్రాన్స్ కో లైన్ ఇన్స్ పెక్టర్ ఆనందరావు నిర్లక్ష్యంతో జరిగిన విద్యుత్ షాక్ తో మంటల్లో తీవ్రంగా గాయపడిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ అనే దినసరి ఎలక్ట్రికల్ వర్కర్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఇటీవల గ్రామ శివారులో గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడి తీగలు తెగిపడగా వాటి మరమ్మత్తు కోసం ఖిలావనపర్తి సబ్ స్టేషన్ లైన్ ఇన్స్పెక్టర్ పిలుపుమేరకు నంది మేడారం గ్రామానికి చెందిన ఎలక్ట్రికల్ వర్కర్ అశోక్ గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో లైన్ క్లియరెన్స్ (ఎల్ సి) తీసుకోకుండానే ఎల్ ఐ ఆనందరావు సూచనల మేరకు సోమవారం ట్రాన్స్ ఫార్మర్ పై పని చేస్తుండగా విద్యుత్ సరఫరా జరిగి షాక్ తో అశోక్ మంటల్లో కాలి తీవ్రంగా గాయ పడిన విషయం తెలిసిందే.
వెంటనే అతనిని చికిత్స కోసం కరీంనగర్ లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించగా అతనికి 80 శాతం గాయాలయ్యాయని వైద్యులు ధ్రువీకరించగా వారి సూచన మేరకు అతనిని అదే రాత్రి చికిత్స చేయించడానికి హైదరాబాద్ లోని యశోద దవాఖానకు తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో యశోద దవాఖాన నుంచి హుటాహుటిన అక్కడి గాంధీ దవాఖానకు అశోక్ ను మెరుగైన చికిత్స కోసం తరలించారు. దీంతో వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలోనే రక్తస్రావం తీవ్రమై అశోక్ పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున మరణించినట్లు గ్రామ సర్పంచ్ మేడారం వీర్ పాల్ తెలిపారు. కాగా అశోక్ మృతి వార్త విని అతడి భార్య, కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లి కన్నీరుగా విలపించారు. అక్కడే మృతుడి శవాన్ని పోస్టుమార్టం చేయించడానికి ధర్మారం పోలీసులు అక్కడికి వెళ్లారు.
పంచనామా నిర్వహించారు. భార్యతో పాటు చిన్నపిల్లలు కూతురు, కుమారుడు ఉన్నారు. విద్యుత్ శాఖలో రోజువారిగా ఎలక్ట్రికల్ పనులు చేయడానికి వెళ్లి విద్యుత్ షాక్ తో అశోక్ మరణించడంతో నంది మేడారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అశోక్ మృతికి కారకులైన ఎన్పీడీసీఎల్ అధికారులు, లైన్ ఇన్ స్పెక్టర్ పై గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తగిన పరిహారం చెల్లించడంతోపాటు మృతుడి భార్యకు ఎన్పీడీసీఎల్ లో ఉద్యోగం ఇవ్వాలని స్థానికుల్లో డిమాండ్ వ్యక్తమవుతోంది.