Collector Garima Agarwal | రాజన్నసిరిసిల్ల, కలెక్టరేట్, జూలై 16 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లక్ష్యానికి అనుగుణంగా పూర్తయ్యేలా అధికారులు రోజువారీగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, వన మహోత్సవం కోసం మొక్కలు నాటే అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. హౌసింగ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈసందర్భంగా సమీక్షించిన కలెక్టర్, ప్రతీ మండలం, మున్సిపాలిటీ వారీగా నిర్మాణాల స్థితిని తెలుసుకున్నారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్లను నిర్ణీత గడువులో పూర్తి చేసి లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశాలు చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని, రెండో విడత మంజూర్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణానికి ఆసక్తి ఉన్న లబ్ధిదారులను గుర్తించి వెంటనే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
వన మహోత్సవంపై మాట్లాడుతూ.. జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సిద్ధంగా ఉంచడంతో పాటు గుంతలు తవ్వడం, నాటేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేయాలని సూచించారు. వర్షాలు అనుకూలంగా వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఈ సమీక్షలో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీపీఓ జయశీలతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.