Heavy Rain | చిగురుమామిడి, అక్టోబర్ 30 : మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై, ఇంటి వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం కుప్పలు వరదనీటిలో మునిగాయి. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు కుంటలు మత్తలు పరవళ్లు తొక్కుతున్నాయి. రేకొండలో పశువులు మృతి చెందాయి.
అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. పలు గ్రామాలకు నీటి ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని చిగురుమామిడి, చిన్న ములుకనూర్, రామంచ, ముదిమాణిక్యం, రేకొండ, బో మ్మనపల్లి, ఇందుర్తి, సుందరగిరి, గాగిరెడ్డిపల్లి తదితర గ్రామాలు చెరువులు, కుంటలు నిండి అలుగులు తొక్కుతున్నాయి. రేకొండ ఊర చెరువు బుధవారం రాత్రి నుండి మత్తడి పడడంతో గ్రామంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఊరి మధ్యలో ఒర్ర నుండి నీరు ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రేకొండ మొగిలిపాలెం, ఎగ్లాస్పూర్ రహదారి మధ్య నీటి ప్రవాహానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామానికి చెందిన ఏరుకొండ రమేష్ పశువుల పాక వద్ద ఉధృతంగా వాగు ప్రవహించడంతో పశువుల పాక కూలి 3 పశువులు కొట్టుకుపోయాయి. రేకొండలోని పెద్దమ్మ పల్లెలో కడెం సరవ్వ మహిళా రైతుకు చెందిన 120 క్వింటాలు వరి ధాన్యం కుప్ప నీటిలో మునిగిపోయింది. చిన్న ముల్కనూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యం కుప్పలు నీట మునిగాయి.
రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగు ఉద్దతంగా ప్రవహించడంతో వాగు పరిసర ప్రాంతాల్లోని వరి పంట పూర్తిగా నీట మునిగింది. సుమారు 30 మంది రైతులకు చెందిన వ్యవసాయ మోటార్లు మునిగిపోయాయి. సీతారాంపూర్ లో మేకల బొందయ్య కౌలు రైతు 4 ఎకరాలు వరి పంట వేయగా, వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది.రెండు కరెంటు స్తంభాలు పడిపోయాయి. సీతారాంపూర్ కరీంనగర్ రహదారి మధ్య తారు రోడ్డు పూర్తిగా పోయింది. ఇందుర్తి గ్రామంలోని ఎల్లమ్మ వాగు ఉదృతంగా ప్రవహించడంతో కోహెడ వైపు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి.
గురువారం తెల్లవారుజామునే ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీవో కిరణ్ కుమార్ మండలంలోని రేకొండ తో పాటు మిగిలిన గ్రామాలను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులను ముందస్తు చర్యలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి గ్రామపంచాయతీ కార్యాలయం పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయంలో పునరావాసము కల్పించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని నల్లాలు, మురికి కాలువల వద్ద షీల్డ్ లను తొలగించాలని సూచించారు. నీరు నిలిచిన మురికి ప్రదేశాల్లో బ్లీచింగ్ చల్లారని సూచించారు. అలాగే తహసీల్దార్ ముద్దసాని రమేష్ రేకొండలో ఏరుకొండ రమేష్ కు చెందిన మూడు పశువులు మృతిచెందగా వాటిని పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని బాధితులకు తెలిపారు.
మండలంలో 3,441 ఎకరాల వరి పంటకు నష్టం
తుఫాను కారణంగా మండలంలోని వరి పంటలు పూర్తిగా పంట నష్ట అంచనాను వ్యవసాయ అధికారులు గురువారం పరిశీలించారు. 2,007 మంది రైతులకు గాను 3,441 ఎకరాల వరి పంట నష్టం వాటిలిందని ప్రాథమిక అంచనా ద్వారా క్షేత్రస్థాయిలో తెలుసుకున్నట్లు ఏవో మల్లేశం తెలిపారు. 33 మంది రైతులకు చెందిన వరి ధాన్యం కుప్పలకు గాను 1572 క్వింటాళ్ల వరి ధాన్యం పూర్తిగా నీట మునిగిందని పేర్కొన్నారు. మరోసారి క్షేత్రస్థాయిలో ఏఈవోలు పరిశీలించి తుదినివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఎవరూ కూడా అధైర్యపడవద్దని ఏవో రైతులను కోరారు.
పంటలను పరిశీలించిన పార్టీల నాయకులు
మండలంలో తుఫాను ప్రభావానికి నష్టపోయిన వారి పంటలను బీఆర్ఎస్, సీపీఐ నాయకులు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, ధాన్యం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.