ఈజీ మనీ లక్ష్యంగా ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పెరుగుతున్న సాంకేతికత పుణ్యమా అని రోజుకో తీరున మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇన్నాళ్లూ బ్యాంక్, ఏటీఎం, క్రెడిట్ కార్డులు, వాట్సాప్ లింకులతో దోచుకున్న కేటుగాళ్లు, కొత్తగా న్యూడ్ కాల్స్ ఎత్తులు వేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు అపరిచిత నంబర్ల నుంచి మహిళలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ, లిఫ్ట్ చేయగానే వీక్షించినట్టు రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలాగే ఉమ్మడి జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులకు కాల్స్ రావడం చర్చనీయాంశమైంది. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని, ఇలాంటి ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌శాఖ హెచ్చరిస్తున్నది.
కమాన్‌పూర్, అక్టోబర్ 21: సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖులను కలవరపెట్టిస్తున్నారు. ఇలాగే ఇటీవల పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని ఓ మాజీ ప్రజాప్రతినిధిని వణికించారు. ఈ నెల 11న మధ్యాహ్నం సదరు మాజీ ప్రజాప్రతినిధికి అపరిచిత నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే మహిళ నగ్నంగా హాయ్ అంటూ మాట్లాడగా, అవాక్కయ్యాడు. ఎవరో ఎందుకు ఫోన్ చేశారో.. తెలియక వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మరో వీడియో కాల్ రాగా, లిఫ్ట్ చేశాడు. అది కూడా న్యూడ్ కాల్ కావడంతో మళ్లీ కట్ చేశాడు. ఇదేంటి..? ఈ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా..? అని చాలా కంగారుపడిపోయాడు. ఇంతలోనే ఓ పోలీస్ అధికారి ఫొటో డీపీగా పెట్టుకున్న నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అప్పటికే కంగారులో ఉన్న సదరు ప్రజాప్రతినిధి లిప్ట్ చేశాడు. ‘నేను పోలీసు కమిషనర్‌ను మాట్లాడుతున్నా. నీవు ఇప్పుడు చూసిన న్యూడ్ వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. వెంటనే యూట్యూబర్‌తో మాట్లాడు’ అంటూ సదరు యూట్యూబర్ నంబర్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు. సదరు నంబర్‌కు మాజీ ప్రజాప్రతినిధి ఫోన్ చేయగా వైరల్ అవుతున్న న్యూడ్ కాల్ వీడియో తొలిగించాలంటే 17,500 చెల్లించాల్సి ఉంటుందని డిమాండ్ చేశాడు. తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పగా, అయితే వైరల్ అవుతున్న వీడియోను తొలగించడం కుదరదని అవతలి వ్యక్తి తెగేసి చెప్పాడు. అంతలోనే ఆ మాజీ ప్రజాప్రతినిధి కొడుకు వచ్చి విషయం తెలుసుకొని, ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించాడు. సదరు పోలీస్ అధికారికి ఫోన్ చేసి.. ‘మేమే పోలీసుల వద్దకు వచ్చాం. ఒకసారి సార్‌తో మాట్లాడండి అని గద్దించినట్లు’ మాట్లాడడంతో కాల్ కట్ చేశాడు. మళ్లీ పలుసార్లు ఫొన్ చేసినా అందుబాటులోకి రాలేదు. తర్వాత ఆ మాజీ ప్రజాప్రతినిధి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇలా ఇటీవల ఓ ఎమ్మెల్యేకు సైతం కాల్ రాగా, వెంటనే అప్రమత్తమై కాల్ కట్ చేసి పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది. వీరే కాదు, ఉమ్మడి జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు సైతం న్యూడ్ వీడియో కాల్స్ వచ్చినట్టు తెలియగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నది.
న్యూడ్ వీడియోలో కనిపించే మహిళ నిజమైన మనిషి అని చాలా మంది అనుకుంటారు. కానీ, కొనిసార్లు అందులో కనిపించే మహిళలు, యువతులు నిజమై ఉండకపోవచ్చు. అదంతా సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన బొమ్మ (సాఫ్ట్వేర్). ఇది నేరగాళ్లు చెప్పినట్లే నడుచుకుంటుంది. అందులో చాటింగ్, వీడియో కాల్స్‌కు ఎలా స్పందించాలో ముందే అల్గారిథమ్‌లో పొందుపరుస్తారు. దీంతో ఎదుటివారికి ఎలాంటి అనుమానం రాదు. ఇది తెలియక అవతలి వైపు ఉన్నవారు నిజంగా మనిషే ఉందని భ్రమ పడి, మోసాలకు గురవుతున్నట్టు తెలుస్తున్నది.
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పై పల్లెల్లో.. పట్టణాల్లో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ మోసపోయే బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఎవరికైనా అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్, వాట్సాప్ ఫోన్ కాల్, వాట్సాప్ వీడియో కాల్ వస్తే వాటిని లిప్ట్ చేయకుండా ఉండాలి. ఒకవేళ లిఫ్ట్ చేయాల్సి వస్తే ఫ్రంట్ కెమెరాపై చూపుడు వేలు పెట్టి లిఫ్ట్ చేయాలి. అవతలి వ్యక్తి మనకు పరిచయస్తులు అయితే కాల్ కంటిన్యూ చేసి మాట్లాడాలి. లేదంటే కట్ చేయాలి. అయితే ఫోన్ వచ్చిన సమయాల్లో చాలా మంది తొందర పడి లిఫ్ట్ చేస్తున్నారు. మోసాల బారిన పడుతున్నారు. కాగా, గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లిప్ట్ చేయకుండా ఉండడమే ఉత్తమమని, ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే 1930కు డయల్ చేసి విషయం చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటప్పుడే సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకుంటారని కమాన్‌పూర్ ఎస్ఐ కొట్టె ప్రసాద్ చెబుతున్నారు.