కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంట్ ‘కట్’కట మొదలైంది. వ్యవసాయానికి అంతరాయం లేకుండా కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో’ తెలియని పరిస్థితి ఉన్నది. రహీంఖాన్‌పేట సబ్‌స్టేషన్ పరిధిలో కోతలతో, ఓవర్‌లోడ్ సమస్య తీవ్రమైంది. దాదాపు 4వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తుండగా, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల పవర్ ట్రాన్స్ఫార్మర్ను అందుబాటులోకి తేవాలని, నాణ్యమైన కరెంట్‌ను అందించి పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇల్లంతకుంట రూరల్, మార్చి 8: మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. కోతలు తీవ్రమవుతున్నాయి. దీంతో పంటలకు నీరందించలేక రైతులు అరిగోస పడాల్సి వస్తున్నది. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేటలోని 33/ 11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. బీఆర్ఎస్ పాలనలో సాగుకు 24గంటల కరెంట్ నాణ్యమైన ఇవ్వడంతో ఎన్నడూ ఇబ్బంది కనిపించలేదు. కానీ, కాంగ్రెస్ వచ్చిన తర్వాత సక్రమంగా ఇస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. వేళాపాలా లేకుండా ఇవ్వడం, అందులోనూ కోతలు తీవ్రం కావడంతో ఓవర్‌లోడ్ పెరిగింది.
ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం 5 మెగావాట్ల పవర్ ట్రాన్స్ఫార్మర్ (పీటీఆర్) ఏర్పాటు చేసినా.. అందుబాటులోకి తేలేదు. ఎన్పీడీసీఎల్ సంస్థ బ్రేకర్లు ఏర్పాటు చేయలేదు. కనెక్షన్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడం, భూగర్భజలాలు అడుగంటుతుండడం, కోతలు తీవ్రకావడంతో సబ్‌స్టేషన్ పరిధిలోని రహీంఖాన్‌పేట, వెల్జిపూర్, వల్లంపట్ల, ఎర్రనర్సుపల్లి గ్రామాల్లో సమస్య తీవ్రమైంది. ఇచ్చేది 15గంటలు, పోయేది15 సార్లు అన్నట్టుగా ఉన్నది. 3 వేల వ్యవసాయ బావులు, బోర్ల కనెక్షన్లకు కరెంట్ సరిగ్గా రాక, యాసంగిలో సాగు చేసిన నాలుగు వేల ఎకరాలు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. దీంతో వేలాది మంది రైతులు పంటలను ఎలా కాపాడుకోవాలోనని ఆందోళన చెందుతున్నారు. సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామానికో రెండు గంటల చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నారని, కనీసం ఒక్క పొలం చివరి వరకు నీరందించలేకపోతున్నామని వాపోతున్నారు.
ఓవర్‌లోడ్ కారణంగా కనీసం నాలుగు నుంచి ఆరు గంటల కరెంట్ కూడా ఉండడం లేదని, పది రోజుల నుంచి తీవ్ర అంతరాయం కలుగుతున్నదని మండిపడుతున్నారు. అసలు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక పొలాల వద్ద కాపలా కాయాల్సి వస్తున్నదని ఆగ్రహిస్తున్నారు. మడి చివరి వరకు పారకపోవడంతో మళ్లీ మళ్లీ అదే పొలానికి నీళ్లు పెట్టాల్సి వస్తున్నదని చెబుతున్నారు. పొలాలన్నీ తడారిపోతున్నాయని, పొట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను అందుబాటులోకి తెచ్చి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.
అసలే ఎండలు దంచుతున్నయి. బావులు, బోర్లలో నీళ్లు తక్కువగా ఉన్నయి. ఉన్న కొద్దిపాటి నీళ్లతో పొలం పారిద్దామనుకుంటే గంటకోసారి కరెంట్ పోతంది. పారిన మడులే పారిచ్చుడు అయితంది. బావిలో నీళ్లు కాస్త అడుగంటినయి. పొలం పారుతలేదు. కరెంటు సరఫరాలో అంతరాయంతో ఇబ్బంది పడుతున్నం. రహీంఖాన్‌పేట సబ్‌స్టేషన్ పరిధిలో కనీసం కరెంటు నాలుగు గంటలు కూడా రావడం లేదు. వరి పొట్టదశలో ఉన్నది. ఇప్పుడు నీళ్లు లేకుంటే పొలం చేతికిరాదు. మడి మడికి పైపులు వేసుకుని పారిస్తున్నం. కరెంటు కోతలు లేకుండా సరఫరా చేస్తే పొలాలు గట్టెక్కుతయి.
-బత్తిని స్వామి, రైతు (రహీంఖాన్‌పేట)
రోజంతా ఐదారు గంటలు కూడా కరెంటు ఉంటలేదు. ఉన్న ఐదారు గంటల్లో కూడా సక్కగా ఉంటలేదు. కోతలతో పొలం చివరి వరకు పారుత లేదు. రహీంఖాన్‌పేట సబ్‌స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 5మెగావాట్ల పీటీఆర్‌కు కనెక్షన్ ఇస్తే ఓవర్‌లోడ్ తగ్గుతుంది. కరెంట్ మంచిగా ఉంటది. అధికారులు స్పందించాలి. రైతులకు కరెంటు ఇబ్బంది లేకుండా చూడాలి. ఇంకో నెల పొలాలు పారితేనే చేతికొస్తయి.
-ఉత్కం పర్శరాం, రైతు (రహీంఖాన్‌పేట)
నేను ఆరెకరాల్లో వరి సాగు చేసిన. పొలమంతా పొట్టకచ్చింది. పది రోజుల సంది కరెంటు సక్కగా ఉంటలేదు. పొలం పారుత లేదు. కరెంటు ఎప్పుడస్తదో తెలియక పొలం దగ్గరనే కావలి ఉండుడు అయితంది. ఇంకో 20 రోజులైతే పంట చేతికత్తది. ఈ సమయంలో బాయిల ఉన్న నీళ్లతోనైనా పొలం పారిద్దామంటే కరెంటు సక్కగ ఉంటలేదు. ఇట్లయితే పంట చేతికచ్చుడు కష్టమే. సర్కారు దయచూపాలి.
-ఉత్కం రాజయ్య, రైతు (రహీంఖాన్‌పేట)