గంగాధర, ఫిబ్రవరి 27 : కాంగ్రెస్ పాలనలో ఎవుసం ఆగం అవుతున్నది. గంగాధర మండలంలో సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. బీఆర్ఎస్ హయాంలో సీజన్‌కు ముందే కాలువలకు మరమ్మతులు చేయించి సకాలంలో నీటిని విడుదల చేసి నీరందించగా, రెండేండ్లుగా పరిస్థితి తారుమారైంది. గంగాధర మండలం మల్లాపూర్, గోపాల్రావుపల్లి గ్రామాల్లో ఏటా యాసంగిలో 200 ఎకరాలకు పైనే రైతులు వరి వేస్తుంటారు. కేసీఆర్ పాలనలో నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి క్రమం తప్పకుండా నీటిని విడుదల చేయడంతో ఏరందీ లేకుండా సేద్యం చేసుకున్నారు.
నారాయణపూర్ నుంచి కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువుకు నీటిని విడుదల చేసి, మళ్లీ అక్కడి నుంచి వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ చెరువుకు వెళ్లే గ్రావిటీ కెనాల్‌కు ఏర్పాటు చేసిన డీ4 కెనాల్ ద్వారా మల్లాపూర్, గోపాల్రావుపల్లిలో చెరువులు, కుంటలు నింపి, నీరందించేవారు. కానీ, రెండేండ్లుగా సక్రమంగా నీరు విడుదల చేయకపోవడం, కెనాల్లో పూడికతీయకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. మరో నాలుగు రోజుల్లో పంటలకు నీరందకుంటే పూర్తిగా ఎండిపోయి పెట్టుబడి సైతం చేతికి రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి.