కరీంనగర్ జిల్లా కేంద్రంలో వ్యాధి నిర్ధారణ అతి పెద్ద వ్యాపారంగా మారింది. మామూలు జ్వరంతో బాధపడుతూ ఏ ప్రైవేట్ దవాఖానకు వెళ్లినా.. ఏ చిన్న వ్యాధితో వైద్యుడిని సంప్రదించినా.. ముందుగా వ్యాధి నిర్ధారణ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపించడం ఆనవాయితీగా మారింది. దీనిని ఆసరా చేసుకుని ఆయా సెంటర్ల నిర్వాహకులు రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అసోసియేషన్ పేరుతో సిండికేట్‌గా ఏర్పడి మరీ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో 30 శాతం ఫీజులు పెంచిన డయగ్నోస్టిక్ సెంటర్లపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అయితే తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ప్రస్తుత జ్వరాల సీజన్లో డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు విపరీతమైన దోపిడీకి తెరతీసి వచ్చిన వారిని వచ్చినట్లు పీల్చి పిప్పి చేస్తున్నట్లు తెలుస్తోంది.
– కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్
చిన్న జ్వరం వచ్చి ఏ ప్రైవేట్‌లో దవాఖానకు వెళ్లినా వైద్యులు రకరకాల పరీక్షల పేరుతో డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపుతుండగా, ఇదే అదనుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఒక్కో పరీక్ష నిర్ధారణకు వేలకు వేల ఫీజులు గుంజుతున్నారు. మామూలు జ్వరంతో వెళ్లిన రోగులకు ఒక్క రక్తానికి సంబంధించినవే నాలుగైదు పరీక్షలు చేయిస్తున్నారు. మూత్ర పరీక్షలు అదనంగా నిర్వహించడం సాధారణయైంది. తీరా ఏ పరీక్షలో ఏమీ లేదు.. అంతా సాధారణంగానే ఉందని, జ్వరానికి సంబంధించిన మందులు రాసి రోగులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
ఇక ఏవైనా వ్యాధులతో దవాఖానాల్లో అడుగు పెడితే చాలు వైద్యానికంటే ఎక్కువ డయాగ్నోస్టిక్ సెంటర్లకే దారపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎక్స్‌రే వంటి విభాగాల్లో దేనికైనా రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. చిన్న జబ్బులతో దవాఖానల గడప తొక్కుతున్న వారికి అడ్డగోలుగా పరీక్షలు రాయడం, నిర్ధారణ కేంద్రాల్లో దోచుకోవడం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మామూలు విషయమై పోయింది.
వ్యాధి నిర్ధారణ కోసం వెళ్తే గతంలో ఒక్కో డయాగ్నోస్టిక్ కేంద్రంలో అక్కడ ఉన్న వైద్య పరికరాల నైపుణ్యతను బట్టి ఈ ధరలు ఉండేవి. ఈ నేపథ్యంలో తక్కువ ఫీజులు తీసుకునే డయాగ్నోస్టిక్ కేంద్రాలకు రోగులు ఎక్కువగా వెళ్లేవారు. గత మూడు నెలలుగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే రకమైన ఫీజులు తీసుకుంటున్నారు. ఎందుకంటే గత జూన్ 1 నుంచి అన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో అసోసియేషన్ పేరుతో బోర్డులు వెలిశాయి. వాటి ప్రకారమే వ్యాధి నిర్ధారణకు ఫీజులు తీసుకుంటున్నామని నిర్వాహకులు గట్టిగా వాదిస్తున్నారు.
ఫీజుల వసూలుకు ఒక నిబద్ధత, నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా ఈ సెంటర్లను నియంత్రించే అధికారం తమకు లేదని వారు చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అసోసియేషన్ పేరుతో సిండికేట్‌గా ఏర్పడి రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారని పలు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. చట్టంలో లొసుగులను ఆసరా చేసుకుని అడ్డగోలుగా దోస్తున్నారని, నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల దోపిడీకి తోడు వైద్యులు రోగులతో చెలగాటమాడుతున్నారు. తక్కువ ధర ఉన్న సెంటర్లకు వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే ఆ ఫలితాలను రెఫర్ చేసిన వైద్యులు అంగీకరించడం లేదు. రక్త, మూత్ర పరీక్షలు సదరు ప్రైవేట్ దవాఖానలకు అనుబంధంగానే ఎక్కువగా నిర్వహిస్తుంటారు. చిన్న చిన్న స్కానింగ్‌లు కూడా కొన్ని దవాఖానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్లను చూసి వీళ్లు కూడా నిర్ధారణ పరీక్షల ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అంతేకాకుండా డాక్టర్లకు డయాగ్నోస్టిక్ సెంటర్లకు విడదీయరాని కమీషన్ల బంధం ఉందనేది జగమెరిగిన సత్యం. ఫలానా డయాగ్నోస్టిక్ సెంటర్‌కే వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కొందరు వైద్యులు రోగులకు ఆర్డర్లు వేస్తుంటారు. వారు చెప్పినట్లు వినక ఇతర సెంటర్లకు వెళ్తే వ్యాధి నిర్ధారణ సరిగా లేదని వంకలు పెట్టడం కరీంనగర్లో పరిపాటిగా మారింది. వ్యాధి నిర్ధారణ ఎలా ఉన్నా ఫరావా లేదు.. తమకు కమీషన్లు వస్తే చాలనుకునే వైద్యులు కోకొల్లలు.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 33 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా కరీంనగర్‌లోనే ఉన్నాయి. సేవా భావం కంటే వ్యాపార కోణంలోనే ఇవి పనిచేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల బారి నుంచి రోగులకు కాస్తయినా ఉపశమనం కలిగించాలనే భావనతో కొన్ని ఉదార సంస్థలు డయాగ్నోస్టిక్ సెంటర్లు నెలకొల్పాయి. వీటికి, ప్రైవేట్ సెంటర్ల మధ్య ఫీజుల విషయంలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఉదార సంస్థల్లో చేసే సీటీ బ్రెయిన్ స్కాన్‌కు రూ.800 అవుతుంటే ప్రైవేట్ కేంద్రాల్లో మాత్రం రూ.2 వేలు తీసుకుంటున్నారు. రూ.2 వేలతో తీసే సీటీ స్కాన్లకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు.
సీటీ పీఎన్ఎస్ స్కాన్‌కు ఉదార సంస్థ రూ.800 తీసుకుంటుంటే ప్రైవేటు సెంటర్లు మాత్రం రూ.2,500 వసూలు చేస్తున్నాయి. ఇలా ప్రతి దానిపై నాలుగైదింతలు ఫీజు వసూలు చేస్తున్నతీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జిల్లా కేంద్రం సమీపంలోని రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న దవాఖానాల్లోనూ డయాగ్నోస్టిక్ ఫీజులు నియంత్రణలోనే ఉన్నాయి. మరి వీళ్లకు ఎలా సాధ్యమవుతోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. ఈ కళాశాలల్లో ఇతర డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో కంటే విలువైన వైద్య పరికరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ విషయమై వారిని అడిగితే తామేమీ చేయలేమనే నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. డీఆర్ఏ చట్టంలో చర్యలు తీసుకోవడానికి ఎలాంటి నిబంధనలూ లేవని చెబుతున్నారు. ఫీజు ఎంత వసూలు చేస్తున్నారనేది కాదని, వసూలు చేస్తున్నది డయాగ్నోస్టిక్ సెంటర్లోగాని, ప్రైవేట్ దవాఖానల్లోగానీ ప్రదర్శిస్తున్నారా? లేదా చూడాలని మాత్రమే చట్టంలో ఉందని అధికారులు చెబుతున్నారు.
చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని బరితెగిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకుల చర్యలను అరికట్టేదెవరని రోగులు ప్రశ్నిస్తున్నారు. అది డయాగ్నోస్టిక్ సెంటర్ అయినా ప్రైవేట్ దవాఖానా అయినా అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు ఏంటి?, వాటి నైపుణ్యత ఏ స్థితిలో ఉంది?, వాటి ద్వారా నిర్ధారిస్తున్న వ్యాధుల నివేదికల స్థితి ఏంటనేది పరిశీలించి, వాటిని బట్టి ఒక నిర్ధిష్టమైన ఫీజులు నిర్ధారించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేస్తే బాగుంటుందని, అలాంటప్పుడే రోగులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
కరీంనగర్‌లోని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గతంలో కొన్ని సెంటర్లలో ఫీజులు తక్కువ ఉండేవి. ఆయా సెంటర్లలో ఉండే ఎక్విప్మెంట్స్ను బట్టి ఫీజులు తీసుకునేవారు. గత మూడు నెలలుగా చిన్న, పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ ఏదైనా ఒకే రకమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. అసోసియేషన్ పేరుతో నిర్వాహకులంతా సిండికేట్ అయ్యారు. దేనికి ఎంత తీసుకోవాలో నిర్ణయించుకున్నారు. ఇంతకంటే తక్కువ ఫీజు తీసుకుంటే రూ.5 లక్షలు జరిమానా విధించాలని నిబంధన పెట్టుకున్నారు. ఇది పేదల మీద విపరీతమైన ప్రభావం చూపుతోంది. వ్యాధి నిర్ధారణ కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
మందులకంటే ఎక్కువ స్కానింగ్‌లకు అవుతున్నాయని వాపోతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. నేనే స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఫీజులు నియంత్రించకుంటే పేదలు తమ రోగాలకే ఉన్నదంతా సమర్పించుకోవల్సి వస్తుంది. అప్పులపాలుకాక తప్పదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి డయాగ్నోస్టిక్ సెంటర్ల చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది.
– ఎడ్ల రమేశ్, సీఐటీయూ కార్యదర్శి