.. ఇక్కడ నెర్రెలు వారిన పొలంలో కనిపిస్తున్న వారు నూనావత్ సరోజ, కుటుంబసభ్యులు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువు తండాకు చెందిన సరోజ. తనకున్న మూడున్నర ఎకరాలలో బోరు బావి ఆధారంగా పొలం వేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్కపేట కెనాల్ ద్వారా వచ్చిన నీటితో తిమ్మాపూర్ మైసమ్మ చెరువు నింపడం, దీని కిందనే ఉన్న సరోజకు చెందిన బోరు బావిలోకి పుష్కలమైన ఊట రావడంతో రెండు సీజన్లలో రందీ లేకుండా సాగు చేసింది. గుంట పొలం కూడా ఎండిపోనివ్వకుండా బంగారు పంటలు పండించింది.
అయితే, ప్రస్తుతం మల్కపేట కాలువ ద్వారా నీళ్లు రాకపోవడంతో చెరువులో నీళ్లు అడుగంటి పోయాయి. దీంతో బోరుబావి మూడున్నర ఎకరాల పొలానికి నీరందించలేకపోతున్నది. ఫలితంగా ఇప్పటికే ఎకరం పొలం కళ్లముందే ఎండిపోగా, మిగతాది కూడా ఎండలు ముదిరితే చేతికి రాకుండా పోతుందని ఆవేదన చెందుతున్నది. ఎండిన పొలాన్ని చూడలేక ఇలా కోసి పశువులకు మేతకు వేస్తున్నది. మూడు నెలలు కష్టపడి సాగు చేస్తే ఇలా నీళ్లందక గుండె‘కోత’ మిగులుతుందని అనుకోలేదని కన్నీటి పర్యంతమవుతున్నది. ఇలా ఒక్క నూనావత్ సరోజనే కాదు, ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట, తిమ్మాపూర్, అల్మాస్పూర్, దేవునిగుట్ట తండా, బాకుర్పల్లి కిష్టూనాయక్ తండా రైతులు సాగునీటి కోసం తండ్లాడుతున్నారు. తమ పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
– ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 18
గొర్రెల మేతకు పొలాలు
తిమ్మాపూర్, ఫిబ్రవరి18: ఎండకాలం రాకముందే తిమ్మాపూర్ మండలంలో సాగునీటి గోస మొదలైంది. తోటపల్లి రిజర్వాయర్ నుంచి డీ ఫోర్ కెనాల్ ద్వారా పలు గ్రామాలకు సాగునీరు రాక తండ్లాడాల్సి వస్తున్నది. మల్లాపూర్ లోయకుంట అడుగంటి పోయింది. సమీప బావులు, బోర్లు ఎత్తేశాయి. కోటి ఆశలతో వేసిన పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. చేసేదేమీలేక జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. డీ ఫోర్ కాలువ నుంచి లోయకుంటకు నీళ్లు వెళ్లేందుకు గతంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఓ కాంగ్రెస్ నాయకుడు పనులు చేశాడని, సరైన ప్రణాళిక లేకుండా చేయడంతో మధ్యలోనే నిలిచిపోయాయని విమర్శించారు. దీని వల్లే మల్లాపూర్ గ్రామానికి ఎద్దడి మొదలైందని మండిపడుతున్నారు. లోయకుంటలో నీళ్లుంటే గ్రామమంతా సస్యశ్యామలంగా ఉంటుందని, నింపకపోతే రాబోయే రోజుల్లో తాగునీటికి సైతం ఇబ్బందులు వచ్చే ప్రమాదముందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.