.. ఇక్కడ బోర్ వద్ద ఉన్న వ్యక్తి పేరు భూక్యా మోహన్. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా. గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన ఆయన అదే తండాలో నాలుగెకరాల భూమి కొన్నాడు. అప్పటి నుంచి అందులో కుటుంబ సభ్యులు వ్యవసాయం చేయగా, అతను గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తూ ఉండేవాడు. గతంలో బోర్లు వేయగా వచ్చిన కొద్దిపాటి నీటితో పంటలు సాగు చేసేది. ఈ భూమి మైసమ్మ చెరువు దిగువ భాగంలో ఉండడం.. గత ప్రభుత్వ హయాంలో చెరువు నింపండంతో బోరుబావుల్లోకి నీళ్లు ఉబికి వచ్చాయి. 24 గంటల కరెంటు ఉండడంతో నాలుగెకరాల్లో గతేడాది వరకు పుష్కలమైన పంటలు పండిస్తూ సంతోషంగా గడిపాడు. కానీ, కొన్ని రోజులుగా చెరువులో నీళ్లు లేకపోవడంతో బోర్లు ఎండిపోయాయి. దీంతో తన ఇంటి ముందున్న పంట ఎండిపోతుంటే తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా పంటను కాపాడుకునేందుకు బోరు వేయాలనుకున్నాడు. పొలం మధ్యలో పాయింట్ చూసి, బోర్వెల్ వెళ్లేందుకు పంట చెడగొట్టి 650 ఫీట్ల మేర బోరు వేశాడు. అయినా, ఫలితం దక్కలేదు. దీంతో మరో చోట 700 ఫీట్లు వేసినా నీళ్లు పడలేదు. సుమారు 2 లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ చుక్కనీరు పడక పోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 6 : ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్, రాజన్నపేట, కిష్టూనాయక్తండా, గొల్లపల్లి, దేవునిగుట్టతండా, బాకుర్పల్లి తండాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. గత ఏడేండ్ల కాలంలో ఈ గ్రామాల్లోని ప్రతి చెరువు నిండుకుండలా మారి బోరుబావుల్లో పుష్కలమైన నీరు ఉండేది. 24 గంటల కరెంటు వచ్చేది. మల్కపేట రిజర్వాయర్ కాలువలో పారే నీరు ఎక్కువై కట్టలు, మత్తడి తెంపిన రోజులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయి.. కరెంటు, పంట నీళ్ల కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్న గడ్డుకాలం అనుభవిస్తున్నామని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వద్దకు వెళ్లి మల్కపేట రిజర్వాయర్ నుంచి కాలువలకు నీళ్లు విడిచి రాజన్నపేటలోని కొచ్చెరువు, తిమ్మాపూర్లోని మైషమ్మ చెరువు నింపాలని వినతిపత్రం అందించామని, అయినా నీళ్లు రావడం లేదని తెలిపారు. అల్మాస్పూర్ నుంచి మొదలు బాకుర్పల్లి వరకు సుమారు 8 కిలోమీటర్ల నిడివిలో కాల్వ పరిసరాలను ఆనుకుని సుమారు 800 ఎకరాలు సాగవుతుండగా, నీరు రాకపోవడంతో ఆ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కొచ్చెరువు, మైసమ్మ చెరువుల్లో నీళ్లు తగ్గి బోరుబావులు ఇంకిపోయాయి. ఇప్పటికే సుమారు70 ఎకరాల వరకు పంటలు ఎండిపోగా మరో పది రోజులు మిగతా పంటలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉండడంతో ఆయా గ్రామాల రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఇంత గోస ఎప్పుడూ పడలేదు
ఇన్నేండ్లల్ల ఇంత గోస ఎప్పుడూ పడలేదు. చెరువులకు నీళ్లు ఇడిస్తే ఉన్న పంటలన్న బతుకుతయ్. నాకు కాల్వ పక్కన రెండెకరాలుంది. వరి పంటేసిన. బోరు ఎండిపోయింది. నీళ్లు లేక పంట ఇడిసిపెట్టే పరిస్థితి వచ్చింది. పెట్టిన పెట్టుబడంతా ఆగమయింది. సేను జూసినప్పుడల్లా దుఖమస్తంది. ఎవ్వలకు జెప్పినా పట్టించుకుంటలేరు. ఎట్లనన్న జేసి మా పంటలకు నీళ్లు వచ్చెటట్టుజెయుర్రి.
– గుగులోత్ భీంసింగ్, రైతు, దేవునిగుట్ట తండా
కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండె
మల్కపేట కాల్వ పక్కపొంటి మాకు నాలుగెకరాలుంది. ఏడేండ్ల సంది ఏ కరువూ లేదు. మా మైసమ్మ సెర్ల నీల్లుంటే బోర్లళ్ల నీళ్లుండేటియి. అది ఈ సారి ఎండిపోయింది. మా తండా వాళ్లు సెర్లకు నీళ్లు ఇడువాలని పోయిర్రట. కానీ, ఇంకా నీళ్లు ఇడువలేదు. పోయినేడాది పంటమీద 70 వేలు వచ్చినయ్. ఆ పైసలతోటి 400 ఫీట్ల లోతు బోరేయించిన. బొట్టు నీళ్లు పడలేదు. కూరగాయల మందం కూడా నీళ్లు వస్తలెవ్వు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండె. ఇప్పుడు పంటలకు నీళ్లు లెవ్వు. తాగుదామంటె కూడా వస్తలెవ్వు.
– బాదావత్ కంసల్య, రైతు, దేవునిగుట్ట తండా