 
                                                            మొంథా తుపాన్ రైతులను నిండా ముంచింది. బుధవారం పడిన భారీ వర్షం, ఆరుగాలం శ్రమను నీళ్లపాలు చేసింది. చేతికొచ్చే దశలో కన్నీళ్లు మిగిల్చింది. ఓపక్క కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని తడిపి, ముద్దచేసింది. ఇంకా కోయని పంటలను నేలరాల్చి, అపార నష్టం తెచ్చింది. ప్రాథమిక అంచనా ప్రకారం యాభై వేలకుపైగా ఎకరాల్లో వరి, పత్తి, మక్క పంటలను చేతికిరాకుండా చేసి, గుండె కోత కోసింది. నోటికి వచ్చిన బుక్కను ఎగరేసుకెళ్లడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. కండ్లముందే దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో తమకీ దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.

కరీంనగర్, అక్టోబర్ 30, (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ ఉమ్మడి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం రోజంతా పడిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. చేతికొచ్చే దశలో వరి, పత్తి, మక్క పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నేడే రేపో కోతలకు సిద్ధంగా పొలాలు గాలివానకు నేలవాలాయి. కల్లాల్లో ఉంచిన వడ్లు వరదకు కొట్టుకొని పోయాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడింది. అయితే వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పినా కింది నుంచి వరద వెళ్లడంతో ప్రయోజనం లేకుండా పోయింది.
దాదాపుగా ఏ మండలంలో చూసినా అపార నష్టం కనిపించగా, రైతులు విలవిలలాడిపోయారు. గురువారం తెల్లవారుజామున దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యం కుప్పలను చూసి తల్లడిల్లిపోయారు. పంటలను కాపాడుకునేందుకు తండ్లాడారు. కొందరు నీటిలో ఉన్న ధాన్యాన్ని దేవుకొని, ఆరబెట్టేందుకు ట్రాక్టర్ల ద్వారా మరో చోటికి తరలించారు. మరికొందరు సమీపంలోనే ఆరబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొనుగోళ్లు వేగవంతం కాకపోవడంతోనే తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.
బుధవారం వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోతున్నా.. కండ్లముందే కొట్టుకుపోతున్నా కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని ఆవేదన చెందారు. చేతికి వచ్చిన సమయంలో పంట నేలవాలడం, గింజ భూమిపై రాలిపోవడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సర్కారు, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నిండా మునగాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు, అధికారులు కేంద్రాలను ప్రారంభించడం మినహా కొనుగోళ్లు చేపట్టలేదని, అలాంటప్పుడు కేంద్రాలను ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం ఇప్పుడు వర్షం పాలైందని, ఈ ధాన్యం ఎప్పుడు ఎండేది? ఎప్పుడు అమ్మేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు.

భరోసానిచ్చిన బీఆర్ఎస్ నాయకులు
భారీవర్షాలకు నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ నాయకులు భరోసానిచ్చారు. దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ధైర్యం చెప్పారు. మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులో దెబ్బతిన్న పొలాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, సుల్తానాబాద్ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, గంగాధర, బోయినపల్లి మండలాల్లో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల రూరల్ మండలంలోని హైదర్‌పల్లిలో పొలాలను, తడిసిన వడ్లను జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పరిశీలించి, రైతులకు తామున్నామనే భరోసా కల్పించారు. వేములవాడ నియోజకవర్గంలో ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో నాయకులు, తంగళ్లపల్లి మండలంలో ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, పార్టీ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల నాయకులు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవాలని, లేకుంటే అన్నదాతల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

కరీంనగర్ జిల్లాలో 34,127 ఎకరాల్లో నష్టం
జిల్లాలోని 183 గ్రామాల్లో 29,797 మంది రైతులకు చెందిన 34,127 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అందులో 26,441 మంది రైతులకు చెందిన 30,565 ఎకరాల్లో వరి, 3321 మంది రైతులకు చెందిన 3,512 ఎకరాల్లో పత్తి, ఒక్క చొప్పదండి మండలంలోనే 35 మంది రైతులకు చెందిన 50 ఎకరాల్లో మక్క దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. ఎక్కువగా హుజూరాబాద్ డివిజన్‌లోనే అపార నష్టం వాటిల్లినట్టు గుర్తించారు.
జగిత్యాల జిల్లాలో 19,128 ఎకరాల్లో నష్టం
జిల్లా వ్యాప్తంగా 280 గ్రామాల్లో మొత్తం 19,128 ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. అందులో 16,679 మంది రైతులకు చెందిన 17,982 ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని గుర్తించారు. అలాగే 1,066 మంది రైతులకు చెందిన 1,146 ఎకరాల్లో పత్తి చేన్లకు నష్టం చేకూరిందని అంచనా వేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కలెక్టర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలను అందజేశారు.
పెద్దపల్లి జిల్లాలో.. 
జిల్లాలో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే వ్యవసాయ శాఖ 196మంది రైతులకు చెందిన 271ఎకరాల్లో నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసింది. రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో నిర్ధారించనున్నది. ఒక్క మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో 450 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసింది.

 
                            