 
                                                            మెట్పల్లి రూరల్, అక్టోబర్ 30: పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు. గురువారం మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులో వర్షానికి నేలవాలిన పొలాలను, తడిసిన మక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులక భరోసా కల్పించి, మాట్లాడారు. వర్షంతో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, తడిసిన, రంగు మారిన ధాన్యం, మక్కలను ఎలాంటి తిరకాసు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
తుపాన్‌తో వరి నేలవాలి అన్నదాతలకు తీవ్ర నష్టం జరిగిందని, కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసిముద్దయిందని ఆవేదన చెందారు. రెండేండ్లుగా వ్యవసాయంపై రేవంత్‌రెడ్డి ఏనాడూ సమీక్ష నిర్వహించలేదని, రైతును పట్టించుకునే నాథుడే లేడని ఆరోపించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరానికి 25 వేల నుంచి 30 వేల దాకా పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, విట్టంపేట, ఫకీర్‌కొండాపూర్ మాజీ సర్పంచులు ఆకుల రాజరెడ్డి, దేవయ్య, మెట్పల్లి ఎల్ఏసీఎస్ మాజీ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు దారిశెట్టి రాజేశం ఉన్నారు.
 
                            