సిరిసిల్ల రూరల్, మార్చి 13: ముందు చూపులేని కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తున్నదని, రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండిపడ్డారు. సాగునీరు అందక యాసంగి పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎండిపోతున్న పంటలకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాలలో సాగునీరందక ఎండిపోయిన వరి పంటలను గురువారం బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ గ్రామంలోని చెరువుల్లో చుక్కనీరు లేదని, బావులు, బోర్లు ఎత్తిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక చేతికచ్చిన పంటలు ఎండిపోతున్నాయని, సుమారు 150 నుంచి 200 ఎకరాల్లో వరి ఎండిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం నాయకులు ఎండిపోయిన చెరువు, వట్టిపోయిన బోర్లు, నిలిచిపోయిన కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత ఆగయ్య మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల్లో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. మధ్యమానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్ను ముందే నింపితే పంటలు ఎండిపోయేవి కాదని చెప్పారు.
కేసీఆర్ సర్కార్ హయాంలో పంటలు ఎండిపోలేదని, సకాలంలో సాగునీరందించారని గుర్తు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అండగా ఉంటుందని మరోసారి ఇచ్చారు. ఆయన వెంట పార్టీ మాజీ మండలాధ్యక్షుడు వొజ్జల అగ్గి రాములు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకటరమణ రావు, నర్మేట ప్రభుదాస్, బండారి శ్యాం, రాములు, మాజీ కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, ఒగ్గు రాజేశం, పోచవేని ఎల్లయ్య యాదవ్, బుర్ర మల్లికార్జున్ గౌడ్ రైతులు ఉన్నారు.