మంథని/మంథని రూరల్/ముత్తారం, మే 2: అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. నేలపాలైంది. రెండు రోజులుగా పెద్దపల్లి జిల్లాలోలోని పలు గ్రామాల్లో రాత్రి సమయంలో ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరి, మిర్చి పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. గురువారం రాత్రి పడిన అకాల వర్షంతో మంథని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది.
ఆరెంద, గోపాల్పూర్, చిన్న ఓదాల, ఎక్లాస్పూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లో కోత దశలో ఉన్న వరి నేలవాలింది. అలాగే ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో తీర్థాల మల్లయ్య, ఉగ్గే మల్లకలకు చెందిన ధాన్యం కొట్టుకుపోయింది. మల్లయ్య మూడెకరాల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా, సుమారు రెండెకరాల ధాన్యం కొట్టుకుపోయింది.
అదేవిధంగా ఉగ్గె మల్లకకు చెందిన ఎకరం ధాన్యం కాస్త బండలు ఉన్న మట్టిలోకి కొట్టుకుపోయాయి. కేంద్రాల్లో ధాన్యం పోసి 20రోజులు అవుతున్నా కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అడవిశ్రీరాంపూర్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.