హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) చాంద్రాయనగుట్టలో దారుణం చోటుచేసుకున్నది. పక్కింటి వారిని తిట్టాడనే కోపంతో పదేండ్ల బాలుడిని సవతి తండ్రి నేలకేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చాంద్రాయనగుట్ట ఘాజిమిల్లత్ కాలనీలో (GM Colony)కి చెందిన నఫీస్ బేగంకు మొదటి భర్తతో కుమార్తె(15), కొడుకు షేక్ అజ్మత్ అజ్హర్(10) సంతానం ఉన్నారు. అయితే మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఇమ్రాన్‌ను ఆమె రెండో వివాహం చేసుకున్నది.
కాగా, అజ్హర్ ఈ నెల 7న పక్కింటి వారితో గొడవ పడ్డాడు. బాధితులు మీ అబ్బాయి బూతులు తిట్టాడని సవతి తండ్రికి చెప్పారు. దీంతో గ్రహించిన ఇమ్రాన్.. అజ్హర్ను చెంపదెబ్బలు కొట్టాడు. అంతటితో ఆగకుండా అతడిని అమాంతం లేపి రోడ్డుకేసి కొట్టాడు. తలకు తీవ్రంగా గాయమవడంతో చెవుల నుంచి రక్తం వచ్చింది. దీంతో అతడిని ఒవైసీ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అజహర్ మృతిచెందాడు. దీంతో కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.