వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు బ్రేక్ వేసేందుకు చట్టసభ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఇండియాపై అదనంగా 50 సుంకాల(Trump Tariffs)ను విధిస్తూ ఇటీవల ట్రంప్ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎత్తుగడను హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు చెందిన ముగ్గురు ప్రతినిధులు వ్యతిరేకించారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్లు తీర్మానం చేశారు. ఇండియాపై అదనపు సుంకాన్ని విధించడం అక్రమం అని పేర్కొన్నారు. అమెరికా వర్కర్లు, వినియోగదారులు, ద్వైపాక్షిక సంబంధాలకు ఇది హానికరమైందని ఆ ముగ్గురు చట్టసభ ప్రతినిధులు ఆరోపించారు.
డిబోరా రాస్, మార్క్ వీసే, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన అత్యవసర అధికారాలను వినియోగించి భారత్‌తో పాటు బ్రెజిల్ దేశాలపై విధించిన అదనపు సుంకాలను ఎత్తవేయాలని చట్టసభ ప్రతినిధులు తమ తీర్మానంలో కోరారు. భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించారని, దాన్ని ఎత్తివేయాలని కోరుతూ చట్టసభప్రతినిధులు తమ తీర్మానంలో డిమాండ్ చేశారు.
సాంస్కృతికపరంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత ముఖ్యమైన భాగస్వామి అని, అక్రమంగా టారీఫ్‌లు విధించడం అంటే నార్త్ టెక్సాస్ ప్రజలపై భారం మోపడమే అని కాంగ్రెస్ నేత మార్క్ వీసే అన్నారు. టారిఫ్‌ల వల్ల సరఫరా క్రమం దెబ్బతింటుందని,అమెరికా వర్కర్లకు హాని కలుగుతుందని, వినియోగదారుల ఖర్చులు పెరుగుతాయని ప్రతినిధి కృష్ణమూర్తి తెలిపారు.