Raju Weds Rambai |తెలంగాణ ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన రూరల్ లవ్ స్టోరీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో–హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ ఇదే తొలి సినిమా అయినప్పటికీ, తమ సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను తాకి కన్నీళ్లు పెట్టించారు. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. అతడి నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి వసూళ్లు సాధించింది.
చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.17 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు అందించింది.థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత, ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ సినిమాను డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో, ఈటీవీ విన్ ఒరిజినల్స్‌తో పాటు డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. శివాజీ రాజా, అనిత చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సురేష్ బొబ్బలి సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. మరి చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం డిసెంబర్ 19న వస్తుందా లేదా అనేది చూడాలి.