Koppula Eshwar | ధర్మారం, డిసెంబర్12: అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కి వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలో పెద్దపల్లి జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ తో కలిసి శుక్రవారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ధర్మారం మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి తుమ్మల రాంబాబు మానస, కొత్తూరులో సర్పంచ్ అభ్యర్థి బానోతు రాజేశ్వరి రాజేశం నాయక్, కొత్తూరులో రాజేశ్వరి తరఫున ప్రచారం చేసి మాట్లాడారు . అనంతరం ఈశ్వర్ ధర్మారం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడే జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను దగా చేసిన విషయాన్ని కూలంకషంగా వివరించారు. అధికారంలోకి రావడానికి ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఆ తర్వాత ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఈశ్వర్ మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మాజీ సీఎం పై కేసీఆర్ పైన విమర్శలు చేయడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకు రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.4 నుంచి రూ.6 వేలకు పింఛన్లు పెంచుతామని, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ప్రభుత్వం వారిని మోసగించిందని ఆయన పేర్కొన్నారు.
కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ఈశ్వర్ ప్రశ్నించారు. రైతులందరికీ రుణమాఫీ తో పాటు రైతు భరోసా సొమ్ము అందరికీ ఇవ్వకుండా మోసం చేసిందని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మరణించిన రైతులకు రైతు బీమా ద్వారా రూ.5 లక్షల సహాయం చేసిందని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎలాంటి బీమా చేయకపోవడం వలన వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వచ్చి చెప్పే అబద్ధపు మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన హితవు పలికారు. ప్రజల మద్దతుతో తాను 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే పదవిలో కొనసాగి రాష్ట్ర మంత్రిగా పనిచేసే ధర్మారం మండలంలో చేసిన అభివృద్ధి కొప్పుల ఈశ్వర్ మార్క్ ఇప్పటికీ ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలనుండి వచ్చి చేసిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. ధర్మారం మండల కేంద్రంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆయన విమర్శించారు.
ధర్మారంలో ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి రూ.2 కోట్లు, ధర్మారంలో కరీంనగర్ – రాయపట్నం రహదారి విస్తరణ కోసం రూ.15 కోట్ల నిధులను తమ ప్రభుత్వ హాయంలో మంజూరు చేస్తే అట్టి నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి అభివృద్ధిని అడ్డుకుందని, ఈశ్వర్ ప్రజలకు ఈ సందర్భంగా వివరించారు. ధర్మారంలో బీఆర్ఎస్ సహాయం లోనే మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మహిళా సమైక్య భవనం, వివో భవనం నిర్మించడంతోపాటు ఆర్టీసీ బస్టాండ్ వెళ్లే ఆర్అండ్బీ దారిలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయించి ధర్మారం మండల కేంద్రానికి కళ తీసుకువచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బడాయి మాటలు చెప్పే దానిని నమ్మవద్దని ఆయన హితవు పలికారు. ధర్మారంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను వార్డు సభ్యులను గెలిపించాలని, ధర్మారం మండల కేంద్రం మరింత అభివృద్ధి చెందాలంటే పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస రాంబాబు కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈశ్వర్ ప్రజలను కోరారు.
మోసాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ : పుట్ట మధూకర్
పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కర్రు కాల్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే ధర్మారం సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస రాంబాబును ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ధర్మారం మాజీ ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, పూస్కూరు జితేందర్ రావు, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు పూస్కూరు రామారావు, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ధర్మారం మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్, పార్టీ అనుబంధ మండలాధ్యక్షుడు దేవి నలినీకాంత్, నాయకులు దేవి రాజారాం, దేవి రాజేందర్,సల్వాజి మాధవరావు, దేవి అజయ్, గంధం తిరుపతి,అమరపల్లి నారాయణ, రాగుల చిన్న మల్లేశం, మహిళా నాయకురాళ్లు కాంపల్లి అపర్ణ, దేవి రేణుక తదితరులు పాల్గొన్నారు.