బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నాంపెల్లి కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21 వరకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, లేదంటే తాము మరోలా జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈ విషయమై హర్షం వ్యక్తం చేశారు.
కరీంనగర్ ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను దిగజార్చే విధంగా ఉన్నాయని, సినీనటులు, కేటీఆర్‌పై అసభ్యకరంగా మాట్లాడడం రాజకీయాలకు మచ్చతెచ్చేలా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. కోర్టు నిర్ణయంతో ఆమెకు మంత్రి వర్గంలో కొనసాగే నైతిక హక్కు లేదని, సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అక్కినేని నాగచైతన్య సమంతల విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను అప్పట్లో సినీ పరిశ్రమ, రాజకీయ నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత పరువు, ప్రతిష్టకు తీవ్ర నష్టం చేశాయని అప్పట్లో కేటీఆర్ నాంపెల్లి కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఉమ్మడి జిల్లాకు చెందిన జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ సాక్ష్యం కూడా చెప్పారు. కేసును అనేక సార్లు విచారించిన నాంపెల్లి కోర్టు ఎట్టకేలకు శనివారం ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల తప్పు లేక పోయినా ఏదో రకంగా బదనాం చేయాలని కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. రాజకీయాలను నీచ స్థితికి దిగజార్చుతున్నారు. మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై చేసిన నిరాధార ఆరోపణలపై కోర్టు స్పందించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించడం హర్ష నీయం. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు చిల్లర ఆరోపణలు, బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి. ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో రాజకీయ నాయకులకు ఇక ముందు భయం అనేది ఉంటుంది.
– మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే మంత్రి సురేఖ కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్లపై ఏది బడితే అది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. వాళ్లు ఏది మాట్లాడినా చెల్లుతుందనే అహంభావంతో కనిపిస్తున్నారు. ఇలాంటి అహంకార పూరిత మాటలకు చెంపపెట్టులాగా నాంపెల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం హర్షనీయం. ఇది ఒక సురేఖపైన ఆదేశాలుగా భావించుకోవద్దు. అబద్ధాలతో ఎదుటి వారిని అపహాస్యం చేసే ప్రతి కాంగ్రెస్ నాయకుడికి ఇది వర్తిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించే వారికి హుందాగా జవాబు చెప్పాలేగానీ, వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా ఉండాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ప్రశ్నించే వారిపై ఈ రకమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రిని భర్తరఫ్ చేయాలి.
– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆడ జాతినే అవమాన పర్చేలా ఉన్నాయి. కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు ఆడ జాతి ప్రతిష్టను దిగజార్చాయి. నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో ఆమె పాత్ర ఉన్నట్లు, అన్నింటికీ ఆమె సాక్ష్యం అన్నట్లు నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఒక మహిళ అయి ఉండి మహిళాలోకం తల వంచుకునేలా మాట్లాడారు. ఆమెకు ఒక కుటుంబం ఉందనే విషయాన్ని మర్చిపోయి తప్పుడు ఆరోపణలు చేయడంతో కోర్టు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయమని ఆదేశించడం హర్షనీయం. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు సభ్య సమాజమే సిగ్గు పడింది. కోర్టులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో న్యాయ వ్యవస్థపై మరింత గౌరవం పెరిగింది. సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఆమెను మంత్రి వర్గం నుంచి తొలగించాలి.
– ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ
కొండా సురేఖను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలి. కేటీఆర్‌పై చేసిన అనుచిత, అసభ్య ఆరోపణలపై కోర్టు స్పందించిన తీరు ఎంతో గొప్పగా ఉంది. న్యాయస్థానానికి తల వంచి నమస్కరిస్తున్నా. కొండా సురేఖకు మంత్రి వర్గంలో కొనసాగే నైతిక హక్కు లేదు. యథా రాజ, తథా పాలన అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఇచ్చిన డైరెక్షన్లోనే మంత్రి సురేఖ ఇలాంటి నీతి బాహ్యమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలతో క్రిమినల్ కేసు నమోదు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆమెను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించి సీఎం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఈ నిర్ణయంతో న్యాయ స్థానాలపై ప్రజల్లో మరింత గౌరవం పెరిగింది.
– బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు