పెద్దపల్లి టౌన్, ఆగస్టు 20: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్ అలస్యం అవుతున్న కారణంగా వయోపరిమితి పెంచాలని, పేద, మధ్య తరగతి వర్గాల నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామక పరీక్షల లీకేజీలను అరికట్టాలని, పరీక్షల నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్లలో వినతిపత్రాలు అందజేశారు.