Chada Venkat Reddy | పెద్దపల్లి టౌన్, జనవరి 2 : 10న పెద్దపల్లి లో నిర్వహించే సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభలను విజయవంతం చేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లిలోని ఆ పార్టీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఏబీ వర్ధన్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ముగింపు బహిరంగ సభ జనవరి 18న ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జనవరి 10న భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కావున జిల్లాలోని పార్టీ ప్రజా సంఘాలు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జిరాంజీ అనే పేరుతో చట్టం చేసి గతంలో 90 శాతం నిధులు కేంద్రం ఇచ్చే పరిస్థితి ఉంటే నేడు దాన్ని 60 శాతానికి కుదించి మిగతా 40 శాతం రాష్ట్రమే భరించుకునే విధంగా చట్టాన్ని చేసే కుట్ర పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ 44 చట్టాలు ఉంటే నాలుగు కోట్లుగా విభజించి దుర్మార్గపు పాలన చేస్తున్న మోడీ ప్రభుత్వం జిరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఆపరేషన్ కగార్ పేరిట దుర్మార్గంగా నక్సల్స్ ను ఎన్కౌంటర్ చేస్తూ ఆదివాసీలను సైతం అతి క్రూరంగా చంపుతున్నారని ఆరోపించారు. డెడ్లైన్ విధిస్తూ దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని, అనంతరం అర్బన్ నక్సల్స్ అంతం కూడా చేస్తామని బహిరంగంగా ప్రకటించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్లు అంటూ దుయ్యబట్టారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, మడికొండ ఓదెమ్మ ,కడారి సునీల్, మార్కపురి సూర్య, తాళ్లపల్లి లక్ష్మణ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటేటి శంకర్,శనిగరపు చంద్రశేఖర్, జూపాక రామచందర్, రాజారత్నం, ఆసాల రమ, కల్లేపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.