Ration card | వేములవాడ రూరల్, జులై 19 : తమకు న్యాయం చేయాలంటూ వేములవాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వేములవాడ పట్టణంలో చెందిన తాళ్లపల్లి అక్షయ్-మమత దంపతులు శనివారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రేషన్ కార్డు కోసం గత మూడు నెలలుగా తాము ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయామని వాపోయారు.
ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకునే వారే లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపిక నశించి తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటకీ తమకు రేషన్ కార్డు మంజూరు కాలేదని చెప్పారు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్‌కు వివరించగా మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.