కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 26 : రాష్ట్రంలో ధాన్యం, గన్నీ బ్యాగుల కొనుగోళ్ల టెండర్లలో విచ్చలవిడి అవినీతి జరుగుతున్నదని రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందనే అరోపణలు ఉన్నాయని, గన్నీ బ్యాగ్ల్లోనూ 50 కోట్లు చేతులు మారాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైనన్నీ గన్నీ బ్యాగ్స్ కొనుగోలు చేయడంలో అలసత్వం వల్ల ఒక బ్యాగ్‌కు 14 నుంచి 18కు ధర పెరిగిందని, ఇది సర్కారు వైఫల్యమేనని ఆరోపించారు. ఒక్క గన్నీ బ్యాగుల విషయంలోనే సుమారు 50 కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒక బ్యాగ్ బరువు 585 గ్రాములు ఉండాల్సి ఉండగా 400 గ్రాములు కూడా ఉండడం లేదన్నారు.
ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ (రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి) వసూలు చేస్తూ కమీషన్లు ఇస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఆర్ఆర్ ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రమే టెండర్లు, గన్నీ బ్యాగ్‌ల కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. ఎఫ్‌సీఐ కేంద్రం చేతుల్లో ఉంటుందని, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ఈ అవినీతి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.
చెడిపోయిన సంచులను తిరిగి అమ్ముతూ పెద్ద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒక లారీ బస్తాలకు 21 వేల నష్టం జరుగుతుందన్నారు. ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి తూతూ మంత్రంగా ఇస్తున్నదని దుయ్యబట్టారు. తక్షణమే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కోనుగోలు టెండర్లు, గన్నీ బ్యాగుల విషయంలో దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల మహేశ్‌కుమార్, కెమసారం తిరుపతి, అనిల్ పాల్గొన్నారు.