కార్పొరేషన్, అక్టోబర్ 31: కరీంనగర్ అసెంబ్లీ బీజేపీలో కలకలం మొదలైంది. ఇప్పటికే పార్టీ నాయకత్వం, స్థానిక నేతలపై అసంతృప్తిగా ఉన్న పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎంపీ తీరు నచ్చకపోవడంతోనే పార్టీని వీడుతున్నామని చెబుతున్నారు. కార్పొరేటర్లు కచ్చు రవి, మర్రి భావన సోమవారం బీజేపీకి రాజీనామా చేయగా, మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే కార్పొరేటర్లు పార్టీ వీడుతుండడం.. మరికొంత మంది చేరేందుకు ఆసక్తి చూపడం, గులాబీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుండడంతో కాషాయ పార్టీలో అయోమయం నెలకొన్నది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి బీజేపీ కార్పొరేటర్లకు సరైన దిశానిర్దేశం చేసేవారు లేకపోవడం.. వారిని పట్టించుకునే వారు కూడా లేకపోవడంతో అసంతృప్తి నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీ వీడిన కార్పొరేటర్లు
కరీంనగర్ నగరపాలక సంస్థకు 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున 13 మంది కార్పొరేటర్లు గెలిచారు. రెండేళ్ల కిందటే 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్, 26వ డివిజన్ నుంచి నక్క పద్మ, 36వ డివిజన్ నుంచి గుగ్గిళ్ల జయశ్రీ బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. మంగళవారం మరో ఇద్దరు కార్పొరేటర్లు మర్రి భావన, కచ్చు రవి బీఆర్ఎస్లో చేరారు. అధినేత కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. వీరితో పాటు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి సతీశ్ సైతం పార్టీలో చేరారు. కార్పొరేటర్లుగా గెలిచినప్పటి నుంచి కూడా తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. తమకు సరైన గుర్తింపు లేకపోవడంతోనే బీఆర్ఎస్లోకి చేరామని కార్పొరేటర్లు చెబుతున్నారు. మరోవైపు ఇద్దరు, ముగ్గురు కార్పొరేటర్లు కూడా మరో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్లో చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగుతున్నది. దీంతో బీజేపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది.