పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను తాకింది. ఇప్పటికే అనేక బడుల్లో మధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యిలపై వండుతుండగా, ఇప్పుడీ కొరత వసతి గృహాల్లోనూ కనిపిస్తున్నది. ఎల్పీజీ గ్యాస్ కొరత లేకుండా అన్నీ చర్యలు తీసుకుంటున్నామని సర్కారు, యంత్రాంగం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. బుక్‌చేసి పదిహేను రోజులైనా సిలిండర్లు రాక.. విద్యార్థులను పస్తులుంచలేక కట్టెల పొయ్యిలను వినియోగించాల్సి వస్తున్నది. దీంతో కట్టెల ధరలు ఇప్పటికే రెట్టింపయ్యాయి. మరోవైపు కట్టెల పొయ్యిలతో మహిళలకు కంటి సమస్యలు వస్తున్నాయి. ఈ కొరత మరో మూడు నాలుగు రోజులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలోని డబ్బు శాతం పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల భోజనాలకు ఇబ్బందులు ఏర్పడే ముప్పు ఉన్నది.

కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఎల్పీజీ సిలిండర్లపై చూపుతున్నది. ఇప్పటికే గృహావసరాలకు కొరత ఏర్పడింది. దీంతో వినియోగదారులు ప్యానిక్ అవుతున్నారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక ముందస్తుగా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే గడిచిన పక్షం రోజుల్లో దాదాపు 25 నుంచి 30 శాతం బుకింగ్‌లు పెరిగినట్టు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసే పరిస్థితి లేక కంపెనీలు, ఏజెన్సీలు ఇప్పటికే పలు నిబంధనలు పెట్టాయి. ఒక సిలిండర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు 21రోజుల తర్వాత, రెండు సిలిండర్లు ఉన్న వినియోగదారులు 30 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని ప్రకటించాయి.
దాని ఆధారంగానే బుక్ చేసిన వినియోగదారుల సీరియల్ సంఖ్యను బట్టి డెలివరీ ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ నిబంధనలు ఉమ్మడి కుటుంబాలకు అంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులున్న వారికి ఇబ్బందిగా మారాయి. గృహ అవసరాలు ఇలా ఉంటే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలో సిలిండర్లు ఫ్రీగా ఉన్నప్పుడు మహిళా సంఘంలోని గ్రూపు సభ్యులు తమ ఇంటి పేరుపై బుక్ చేసిన సిలిండర్లు తెచ్చి వంట చేసేది. మెజార్టీ పాఠశాలలకు నెలకు ఆరు సిలిండర్ల వరకు అవసరం పడేవి. పాఠశాల పేరిట రెండు మాత్రమే వచ్చేవి. అయితే గ్రూపులోని సభ్యులు తమ తమ పేర్లతో గృహ అవసరాల కోసం బుక్ చేసుకున్న సిలిండర్లను తెచ్చి పాఠశాలల్లో వినియోగించేది. ప్రస్తుతం గృహావసరాలకు సిలిండర్లు రావడం లేదు. పాఠశాల పేరిట వచ్చే సిలిండర్లు అయిపోయాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా బుక్ చేసి పదిహేను రోజులవుతున్నా మెజార్టీ పాఠశాలలకు రావడం లేదు.
ఫలితంగా కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూస్తే ఇప్పటికే సుమారు 32 శాతం పాఠశాలల్లో గ్యాస్ కొరత ఏర్పడి కట్టెల పొయ్యిలపైనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. కట్టెల పొయ్యి మీద వంటలు చేయాల్సి రావడం వల్ల మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పొగ, వేడితో కండ్లు వాచిపోతున్నాయని వాపోతున్నారు. అలాగే పొగ ద్వారా శాశ్వకోస వ్యాధులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ పొగ ప్రభావం కేవలం వంట చేసే మహిళలకే కాదు, పిల్లలపైనా పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కట్టెలకు డిమాండ్ ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. నెల క్రితం వరకు క్వింటాల పొయ్యి కట్టెలకు 300 మాత్రమే ఉండగా, ఇప్పుడు 600 నుంచి 700కు చేరాయి. వీటిని కొని పాఠశాలలకు తేవడానికి కిరాయిలు దాదాపు 100కుపైగా అవుతున్నాయి. ఇదే పరిస్థితి సంక్షేమ వసతి గృహాలకు కూడా తాకింది. అయితే పాఠశాలలంతా తీవ్ర స్థాయి లేదు. కానీ, మూడు నాలుగు రోజుల్లో బుక్ చేసిన సిలిండర్లు రాకపోతే మెజార్టీ వసతి గృహాల్లోనూ ఇదే దుస్థితి ఉంటుందని వసతి గృహాల ఇన్చార్జిలు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసముందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కండ్లు ఎర్రబడుతున్నయి
గ్యాస్ దొరకక కట్టెల పొయ్యి వాడుతున్నం. అవి మండడానికి ఊదాల్సి వస్తున్నది. కట్టెల పొయ్యిల కాబట్టి పొగంతా ఇక్కడిక్కడే ఉంటంది. దీంతో కండ్లు ఎర్రబడుతున్నయి. నా కళ్లు కూడా ఎర్రబడ్డయి. దవాఖానకు పోతే పొగ సూరొద్దు అంటున్రు. పిల్లలకు తిండి పెట్టాలంటే కట్టల పొయ్యి పెట్టక తప్పదు. ఇబ్బంది అయినా కండ్లు ఎర్రబడ్డా తప్పడం లేదు.
– అనిత, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు
బ్లాక్‌లో రూ.2400 అంటున్నరు
దాదాపు నెల క్రితం గ్యాస్ బుక్ చేసినం. ఇప్పటివరకు రాలేదు. కానీ, బ్లాక్‌లో మాత్రం దొరుకుతుందని చెబుతున్నరు. అయితే ఒక బుడ్డి(సిలిండర్)కు 2,400 అడుగుతున్నరని తెచ్చుకున్నోళ్లు చెబుతున్నరు. గంత ధర పెట్టి మేం ఎట్ల కొంటం? అందుకే కట్టెల పొయ్యిని వాడుతున్నం. దీని వల్ల చానా ఇబ్బంది పడుతున్నం. బ్లాక్‌లో ఎట్ల దొరుకుతయి? మాకెందుకు రావో అర్థం అయితలేదు. మాకు గ్యాస్ వచ్చేలా చూడాలి. అప్పుడే పిల్లలకు టైం ప్రకారం వంట చేయవచ్చు. పొగ కూడా ఉండదు. భాగ్యలక్ష్మి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు
కట్టెల రేట్లు బాగా పెరిగినయి
గ్యాస్ బుక్ చేసి పదిహేను రోజులైతంది. ఇగో వస్తుంది.. అగో వస్తుంది అంటున్నారే తప్ప రావడం లేదు. పిల్లల్ని పస్తులుంచలేక కట్టెలపొయ్యిలు వాడుతున్నం. పాఠశాలల్లో పొగవస్తుందంటున్నరు. కానీ, తప్పడం లేదు. మాకు చాలా ఇబ్బందులవుతున్నయి. కట్టెల రేట్లు బాగా పెరిగినయి. ఇన్ని రోజులు క్వింటాలుకు 250 ఉండేటియి. ఇప్పుడు 600 అయినయి. మాకు వెంటవెంటనే గ్యాస్ ఇస్తే బాగుండేది. కానీ, గ్యాస్ రాక కట్టెలు కొని వంట చేస్తున్నం. పొగతో మేము, పిల్లలు ఇబ్బంది పడుతున్నం. అందుకే మా కోసం ప్రత్యేక కోటా కేటాయించి ఇస్తే బాగుంటుంది.
– కవిత, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు