ఇల్లంతకుంట, జనవరి 8: మండలంలోని అనంతగిరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా కళాకారులతో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆటపాట పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదమే తన బలమని, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. ఈ సమ్మేళనానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి దాదాపు మూడువేల మంది రావడం సంతోషంగా ఉందన్నారు.
ఇల్లంతకుంట మండలంలో గత నెలలో జరిగిన సెస్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా నిలిచి 1600కు పైగా మెజార్టీ అందించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవకుడిలా పని చేస్తానన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు హాజరు కాగా, వారిని నాయకులు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కళాకారులు పాటలు పాటగా మహిళలు దాండియా ఆడారు. తెలంగాణ ధూంధాం పాటలపై ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు స్టెప్పులేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి ముందుగా ముత్యాల పోచమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. అమ్మవారికి బోనాలు తీసి, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీల తదితరులు పాల్గొన్నారు.