Ramagundam Mayor | కోల్ సిటీ , జూన్ 6: రామగుండం నగర పాలక సంస్థ మేయర్ స్థానం రిజర్వేషన్ మార్చేందుకు కుట్ర జరుగుతుందనీ, అందులో భాగంగానే ఇటీవల వార్డుల పునర్విభజనలో దళితుల ఓట్లనే గల్లంతు చేశారని దళిత సంఘాల నాయకులు, బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు నీరటి శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో ఆరోపించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 46 వేల దళితుల ఓట్లు ఉండటంతో మేయర్ పదవి ఎస్ సీ రిజర్వేషన్ కొనసాగుతూ వస్తుందనీ, కానీ ఈసారి మేయర్ రిజర్వేషన్ ను మార్చేందుకు కుట్ర పూరితంగానే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేయించినట్లు అనుమానం కలుగుతుందన్నారు.
నగర పాలక సంస్థ పరిధిలో భౌగోళిక హద్దులను పరిగణలోకి తీసుకోకుండా కేవలం నాలుగు గోడల మధ్య చూచిరాతగా ఒక్కరోజులోనే పునర్విభజన ఏలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగానే 60 డివిజన్ల పునర్విభజన జరిగినట్లు అనుమానం ఉందన్నారు. దాదాపు అన్ని డివిజన్లలో కేవలం దళితుల ఓట్లు మాత్రమే గల్లంతయ్యాయని, స్వయాన కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న రామగుండం కార్పొరేషన్ కు ఇన్చార్జి కమిషనర్ గా ఐఏఎస్ అధికారి అరుణ శ్రీ వ్యవహరిస్తుండటం, ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ డివిజన్ల పునర్విభజన తప్పుల తడకగా మార్చడం బాధాకరమన్నారు. ఈ విషయంలో దళితులంతా పార్టీలకు అతీతంగా ఒకతాటిపైకి వచ్చి మేయర్ స్థానం యధావిధిగా ఎస్సీలకే కేటాయించేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.