తిమ్మాపూర్, అక్టోబర్ 28 : రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో తలదూరుస్తూ కుట్ర పన్నుతున్నదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ఏండ్లు కష్టపడి సాధించుకున్న తెలంగాణను రేవంత్‌రెడ్డి సర్కారు ఆగం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల సత్యనారాయణ చేష్టలతో మానకొండూర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో చావైనా, బతుకైనా పండుగలా జరుపుకోవడం సంస్కృతి అని, అది మరిచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది నూతన గృహప్రవేశం సందర్భంగా ఇస్తున్న దావత్‌ను రచ్చచేసి రాజకీయం చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్ ఎండగడుతుండడం వల్లనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కరీంనగర్ జిల్లాకు పేరు ప్రతిష్టలున్నాయని, కానీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి మాటలు సిగ్గుపడేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రశ్నించాల్సిన ఆయన తీరు ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బండి మాటలతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుబంధం బయటపడుతున్నదన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణకు కమీషన్ల పిచ్చి పట్టిందని రసమయి ఆరోపించారు. తిమ్మాపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి కాంట్రాక్టు పూర్తి కాకముందే 2.5 కోట్లు కమీషన్లు అడిగినట్లు తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. తాను ఆయనలాగా కమీషన్లు తీసుకోలేదని, అన్ని పర్మిషన్లు తీసుకుని ఫౌల్ట్రీ ఫాం బిజినెస్ చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజకీయం చేస్తే బాగుంటుందని, వ్యక్తిగత విమర్శలకు దిగాడని, ఇక ఆయన పతనం ప్రారంభమైందని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో తన వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని, రోజుకో లీక్ చేస్తానని చెప్పారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ఎస్ఐలు శివప్రసాద్, హరిప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఉంటూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి ప్రజలను షాడో ఎమ్మెల్యేతో కలిసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
జమ్మికుంటలోని వారికి చెందిన సురక్ష దవాఖానలో దొంగ బిల్లులు చేయించి సీఎంఆర్ఎఫ్ స్కాం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుడైన కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఓ గ్రామానికి అర్ధరాత్రి వెళ్లి వివాహితతో దొరికిన వీడియో బయటకు వస్తే సస్పెండ్ చేయాల్సింది పోయి.. వెనుకేసుకొస్తున్నాడని, ఆయనలాగే ఆయన అనుచరులున్నారని దుయ్యబట్టారు. ఆ వీడియోను కాంగ్రెస్ నాయకులే మీడియాకు పంపారని, ఓ చానల్లో వార్త వస్తే తనకు లింకు పెట్టి అనుచరులతో తిట్టించడమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వదిలేశాడని, అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు లేక రైతులు మధ్యవర్తులు, రైస్‌మిల్లర్లకు తక్కువకే అమ్ముకుంటున్నారని, కొంచెం కమీషన్లు, తనపై పగను పక్కన పెట్టి రైతులకు నష్టం లేకుండా చూడాలని హితవుపలికారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.