Siricilla SES | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 24: సెస్ సంస్థతో ఎటువంటి సంబంధం లేని కొంత మంది వ్యక్తులు ఎన్పీడీసీఎల్ లో విలీనం చేయాలని కుట్రలు చేస్తున్నారని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన గురువారం సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) 51వ మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిక్కాల రామారావు సెస్ తో సంబంధం లేని వ్యక్తులు సంస్థపై అసత్య ఆరోపణలు చేస్తూ ఎన్పీడీసీఎల్ లో విలీనం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పాలకవర్గం ఉన్నంత కాలం ఎట్టిపరిస్థితులలో విలీనం అనేది జరగనీయబోమని స్పష్టం చేశారు.
లాభాల బాటలో ఉన్న సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎన్పీడీసీఎల్ గైడ్లైన్సులోనే సంస్థ పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి భారీగా విద్యుత్ బకాయిలు ఉన్నాయని అన్నారు. ఆయా చోట్ల విద్యుత్ చౌర్యం వలన సంస్థ నష్టాలలోకి వెళ్లిందని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ఉద్యోగులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తమ పాలకవర్గం ఏర్పడి తరువాత ఎటువంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, ఎన్పీడీసీఎల్ ద్వారా నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తమ ప్రమేయం ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి మాదవి, దార్నం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్‌రెడ్డి, నారాయణరావు, అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారాం, నామాల ఉమ, రేగులపాటి హరిచరణ్ రావు, కొట్టిపల్లి సుధాకర్, ఆకుల దేవరాజం, సెస్ మేనేజర్ విజయేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.