సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నది. పోయిన యాసంగి సీజన్లో కొన్న ధాన్యానికి సంబంధించి నేటికీ బోనస్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 కోట్లకుపైనే రావాల్సి ఉన్నట్టు తెలుస్తుండగా, ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాలో రూపాయి జమ చేసిన పాపాన పోలేదు. వానకాలం సీజన్ కొనుగోళ్లు ప్రారంభమవుతున్నా.. ఇప్పటి వరకు ఎప్పుడిస్తారో కూడా కనీసం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణికి వెళ్లి వినతిపత్రాలు ఇస్తున్నారు. బోనస్ ఆశతో తాము ఎన్నో కష్టాలు అనుభవించి సన్నాలు పండించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నరకం ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నదని, బోనస్ డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : పండించిన ప్రతి పంటకూ కేంద్రం ఇచ్చే కనీస మద్దతు ధరపై 500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు తప్పినట్టుగానే ఈ హామీని కూడా విస్మరించింది. అన్ని రకాల పంట ఉత్పత్తులపై ఇస్తామని చెప్పి తీరా కేవలం సన్నరకం ధాన్యానికి మాత్రమే బోనస్ వర్తిస్తుందని చేతులెత్తేసింది. కనీసం సన్నరకాలకైనా బోనస్ సరిగ్గా ఇస్తున్నారా..? అంటే అదీ లేదు. దొడ్డురకం ధాన్యంతో కలిపి సన్నాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే సన్నాలపై క్వింటాల్‌కు 500 బోసన్ వస్తుందనే ఆశతో రైతులు సన్న రకాల సాగును రెండు మూడు సీజన్లు పెంచారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సన్నరకాలు తెచ్చిన తర్వాత కొలతలు నిర్వహిస్తున్నారు. అనుకున్న ప్రకారంగా ఉంటేనే సన్నాలుగా నిర్ధారించి కొంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నది. కొనుగోళ్లు పూర్తయిన తర్వాత కనీస మద్దతు ధరపై బోనస్ రైతుల ఖాతాల్లో వేయాల్సి ఉంటుంది. కానీ, గత యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్ ఇప్పటి వరకు జమ చేయలేదు. ఒక్కో రైతుకు వేల నుంచి లక్షల్లో బోనస్ జమ చేయాల్సి ఉన్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 80 కోట్లకుపైగా రావాల్సి ఉన్నట్టు తెలుస్తున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 16.20 కోట్ల వరకు ఉన్నది. గతేడాది వానకాలం సీజన్లో చెల్లించాల్సిన బోనస్ మూడు నెలలు ఆలస్యంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. కానీ, గత యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం వానకాలం సీజన్ కోతలు మొదలయ్యాయి. కొనుగోళ్లు కూడా ప్రారంభమయ్యాయి. కానీ, యాసంగి బో నస్ గురించి మాత్రం ప్ర భుత్వం నోరు మెదపడం లేదు.
బోనస్ కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వానకాలం సీజన్ ముగింపునకు వచ్చినా నేటి వరకు ఒక్క రైతు ఖాతాల్లో చిల్లి గవ్వ వేయలేదు. కరీంనగర్ జిల్లాలో చూస్తే హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, వీణవంక, గంగాధర, తదితర మండలాల్లో ఎక్కువగా సన్నరకం వడ్లు పండించిన రైతులు, ప్రభుత్వం బోనస్ ఇస్తుందని ఆశించి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఇలానే సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోనూ పెద్ద ఎత్తున అమ్మారు. కానీ, ఇప్పటి వరకు ఒక్కరికీ బోనస్ డబ్బులు రాలేదు. దీంతో రైతులు తమ బోనస్ ఇప్పించాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అంతే కాకుండా ప్రజావాణిలో కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఫిర్యాదులు చేస్తున్నారు. బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం తమని మోసం చేసిందని సన్నవడ్లు విక్రయించిన రైతులు వాపోతున్నారు. అయితే రైతులు చేసిన ఫిర్యాదులపై అధికారులు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ ప్రకారంగా సన్నవడ్లకు బోనస్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వానకాలం కొనుగోళ్లు మమ్మురంకాక ముందే తమ బోనస్ డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు.
పోయిన యాసంగిలోనే బోనస్ ఇవ్వని ప్రభుత్వం ఈ వానకాలం సీజన్లో ఇస్తుందన్న నమ్మకం రైతుల్లో కనిపించడం లేదు. ఈ కారణంగా ఈ సారి సన్నవడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తాయా.. రావా..? అనే సందిగ్ధత నెలకొన్నది. అయితే గత వానకాలంలో మూడు నెలలు ఆలస్యంగానైనా రైతుల ఖాతాల్లో బోనస్ జమ చేసిన ప్రభుత్వం, యాసంగి సీజన్‌కు సంబంధించి బోనస్‌పై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సారి కూడా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున సన్నరకం వరిని సాగు చేశారు. కరీంనగర్ జిల్లాలో 1,17,469 ఎకరాల్లో సన్నాలు సాగు చేయగా, ఈ సారి 2,40,072 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో స్థానిక అవసరాలకు పోనూ 1,33,855 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, బోనస్ ఆశ చూపి ఇవ్వక పోవడంతో రైతులు మిల్లర్లకు విక్రయించడానికే ఎక్కువగా చొరవ చూపే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో నష్టపోయే ప్రమాదం ఉన్నది.
పోయిన యాసంగి సీజన్లో సన్నరకం వడ్లకు బోనస్ వస్తుందనే ఆశతో నాలుగెకరాల్లో సన్నరకం వరి వేసిన. అష్టకష్టాలు పడితే 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కోనరావుపేట కొనుగోలు కేంద్రంలో అమ్మిన. ప్రభుత్వం క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తానని చెప్పింది. నాకు 60వేల బోనస్ డబ్బులు రావాల్సి ఉన్నది. కానీ, ఇప్పటివరకు నా ఖాతాలో బోనస్ జమకాలేదు. ఇప్పుడు వానకాలం సీజన్ వరి కోతకు అచ్చింది. అయినా బోనస్ పడలేదు. ఎప్పుడిస్తరో తెలియడం లేదు. ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బులు చెల్లించాలి.
పోయిన యాసంగిల నాకున్న భూమిలో దొడ్డురకం వరితోపాటు మరో మూడెకరాల్లో సన్నరకం వరి వేసిన. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 64 క్వింటాళ్ల ధాన్యం అమ్మిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోనస్ రాలే. నాకు 32వేల బోనస్ రావాలి. కానీ, ఇప్పటివరకు బోనస్ డబ్బులు ఇవ్వకపోవడం సరికాదు. కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం కూడా బోనస్ బకాయిలను ఇస్తుందా.. ఇవ్వదా..? అనే విషయం ఇప్పటివరకు చెప్పలేదు. మళ్లీ ఇప్పుడు వానకాలం పంట చేతికొచ్చే సమయం వచ్చింది.