మంథని రూరల్, ఆగస్టు 19 : తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి, రైతుల కన్నీళ్లు తుడిచిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ విషం చిమ్ముతున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నా ఆపాలనే ఆలోచన చేయకుండా, ఇటు రైతులు, ప్రజలకు ఉపయోగపడకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులు చేస్తున్న విధ్వంసంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన చెందారు. ఈ ప్రభుత్వానికి గోదావరి గోస కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.
ఈ మేరకు మంగళవారం మంథని మండలం సిరిపురం గ్రామ శివారులోని పార్వతీ బరాజ్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. గోదావరి ఒడ్డున ‘గోదావరి విలాపం’ అనే నినాదంతో బ్యానర్ ప్రదర్శించి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వృథాగా దిగువకు వెళ్తున్న గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎదురెక్కించి, రాష్ట్రం అంతటికీ పారించారని గుర్తు చేశారు.
కానీ, నేడు కాంగ్రెస్ పాలనలో కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతూ రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. గోదావరిలో నీళ్లు లేక మంథని మండలంలోని బెస్తపల్లి, సిరిపురం, గుంజపడుగు, మంథని తదితర ప్రాంతాల మత్స్యకారులు ముంబైకి మళ్లీ వలసలు పోతున్నారని ఆవేదన చెందారు. ప్రజా సంక్షేమం కోసం పని చేయాలనే సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి గానీ, నాయకులకు గానీ లేకపోవడం దురదృష్టకరమన్నారు.
కాంగ్రెస్ నాయకులు చరిత్రలో అభివృద్ధి విరోధకులుగా మిగిలిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కండ్ల ముందే లక్షల క్యూసెక్కుల స్వచ్ఛమైన నీరు సముద్రంలో కలువడం ద్వారా ఎవరికీ లాభం లేకుండా పోతున్నదని, గోదారి తల్లి విలవిలలాడుతున్నదన్నారు. అయినా ప్రభుత్వం కళ్లు మూసుకొని ఉన్నదే తప్పా ఈ నీటిని ఒడిసి పట్టాలనే ఆలోచన చేయకపోవడం మన దురదృష్టమని విచారం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపితే ప్రాజెక్టు కట్టినోళ్లకు పేరు వస్తుందనే ఆలోచనతోనే రేవంత్ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ దెబ్బతిన్నదని చెబుతున్నారని, కానీ పార్వతీ బరాజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా గేట్లు ఎత్తి నీళ్లను ఎందుకు వృథా చేస్తున్నారో జవాబు చెప్పాలన్నారు. ఒక ప్రాంతానికి పరిశ్రమనో.. ప్రాజెక్టో వస్తే అందులో ఏదైనా సమస్య ఉంటే అకడి నాయకులు సరిచేసి ఉపయోగంలోకి తీసుకురావాలే తప్ప దానిని పూర్తిగా పనికి రాకుండా చేయవద్దని హితవుపలికారు.
సీఎం రేవంత్‌రెడ్డి, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరిచి ఇప్పటికైనా వృథాగా పోతున్న గోదావరినీళ్లను ఆపి ఉపయోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు ఏగోళపు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్, కనవేన శ్రీనివాస్ యాదవ్, మిరియాల ప్రసాద్‌రావు, రాజు గౌడ్,గుజ్జుల రాజిరెడ్డి, కొండ రవీందర్, ఆరెపెల్లి కుమార్, కాయితి సమ్మయ్య, ఎడవెల్లి నరేశ్‌రావు, దండె ప్రసాద్, దేవళ్ల విజయ్‌కుమార్, రవీందర్రావుతోపాటు తదితరులు ఉన్నారు.