కరీంనగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ) : ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వ్యవహార శైలిపై కర్షకలోకం భగ్గుమంటున్నది. ఆయన మాట్లాడిన మాటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతు వేదికల సాక్షిగా రెండో రోజూ జరిగిన సభల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు, కాంగ్రెస్ తీరుపై నిప్పులుగక్కారు. ‘రైతుదోహి రేవంత్ రెడ్డి’ అంటూ నినదించారు. దశాబ్దాల పాటు పాలించి.. అన్నదాతల ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్‌కు భవిష్యత్‌లోనూ పుట్టగతులుండవంటూ హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్ ఇస్తూ తమకు అన్నివిధాలుగా అండగానిలుస్తున్న కేసీఆర్‌కే తమ మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు. ఉచిత విద్యుత్ విషయంలో ద్వంద్వ మాటలు మానుకొని.. రేవంత్‌రెడ్డి భేషరతుగా తమకు క్షమాపణ చెప్పాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేదంటే.. భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించిన అన్నదాతలు.. అడుగడుగునా కాంగ్రెస్‌కు వ్యతిరేక తీర్మానాలు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం చల్లారడం లేదు. మూడు రోజుల పాటు దిష్టిబొమ్మల ఉరితీతలు, దహనాలు వంటి కార్యక్రమాలతో నిరసనలు తెలిపిన రైతులు ఇప్పుడు రైతు వేదికల్లో సదస్సులు నిర్వహించుకుంటూ 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి ఎంత అవసరమో వివరిస్తున్నారు. ఒకప్పుడు కరెంటు కోసం పడిన బాధలు, కష్టాలు, కన్నీళ్లను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో అతీగతీ లేని కరెంట్ ఇచ్చిన నాయకులు ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితిని తేవాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న ప్రతి సదస్సులో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు, సాగు నీరు లేక వేలాది ఎకరాలు బీళ్లుగా పడి ఉన్నాయని, స్వరాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని, ఫలితంగా తాము పుష్కలమైన పంటలు పండించుకుని సుఖంగా బతుకుతుంటే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలిచి వేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. రైతైన నాయకునికే రైతు కష్టాలు తెలుస్తాయని, మూడు గంటల కరెంట్ ఇస్తే వ్యవసాయం ఎట్లా చేస్తామని నిలదీస్తున్నారు. రైతులకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు, రేవంత్‌రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. రైతుల వెంటే తమ ప్రభుత్వం ఉంటుందని, మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా..? మూడు పంటలు పండించుకునే అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? ఆలోచించాలని రైతులను కోరుతున్నారు. రెండో రోజు జరిగిన సమావేశాల్లో 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రైతులు తీర్మానాలు చేశారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. హుజూరాబాద్ రైతు వేదిక వద్ద జరిగిన సభకు ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. గంగాధర మండలం కురిక్యాలలో జరిగిన సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
రామడుగు మండలం గోపాల్రావుపేటలో రైతులు సమావేశమయ్యారు.
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ రైతువేదికలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గం వెల్గటూరు మండలం గొడిసెలపేట, ధర్మపురి మండలం రాజారాం గ్రామాల్లో రైతు సమావేశాలు జరిగాయి. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్, మల్లాపూర్ మండల కేద్రంలో రైతులు సమావేశమయ్యారు. జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండల కేంద్రంలోనూ రైతులు సమావేశమై కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు, సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామం వద్ద జరిగిన రైతు సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, మంథని మండలం గుంజపడుగు రైతు వేదిక వద్ద రైతులు సమావేశమయ్యారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలోనూ రైతులు సమావేశమై ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో పొలాలకాన్నే ఉన్నం
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం పంట పొలాలకాన్నే పడిగాపులు కాసినం. భార్యాపిల్లలను వదిలి రాత్రింబవళ్లు పాములు, తేళ్ల మధ్య గడిపినం. అప్పుడు ఆరు గంటల కరెంట్ ఇస్తమని చెప్పి అదీ సక్కగ ఇయ్యకపోయేది. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. మరో రెండెకరాలు కౌలుకు చేస్తున్న. మూడు గంటల కరెంట్ ఎకరం భూమికి సరిపోదు. బీఆర్ఎస్ సర్కారు ఇస్తున్న 24 గంటల కరెంటే మాకు కావాలె. తెలంగాణ సర్కారు వచ్చినకం సీఎం కేసీఆర్ సార్ ఎన్నికల ముందు చెప్పినట్లు 24 గంటల కరెంటు ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్నడు. కేసీఆర్ సార్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటం.
– న్యాతరి పోచయ్య, రైతు, సుద్దాల(సుల్తానాబాద్‌రూరల్)
మూడు గంటలకు మూల కూడా పారది
కాంగ్రెస్, టీడీపోళ్ల పాలనల కరెంటు సక్కగ దిక్కులేక అష్టకష్టాలు పడ్డం. పొలం కాడికి రాత్రి పూట కరెంటు పెట్టడానికి పోతే ఎప్పుడు వస్తదో తెలువక పోయేది. అక్కడనే పండుకుని కరెంటు పెడితే అచ్చుకుంట పోవుడుతోటి గలుమ కూడా పారకపోయేది. గలుమ దాటితే మల్లా పారిందే పారేది. ఇగ గఓంటి కరెంటు ఇచ్చినోళ్లు ఇప్పుడు నోటికచ్చినట్టు మాట్లాడవట్టే. మూడు గంటల కరెంటు సాలట.. మూడు గంటలు ఇస్తే పొలం మడిలో మూల కూడా పారదు. అసలు ఎవుసం గురించి ఏమైనా ఎరుకైతే మాట్లాడాలె. అట్టిగనే నోరుపారేసుకుంటే మంచిగుండదు. 24 గంటల కరెంటుతో రైతులు సల్లంగ పొలాలు పారించుకుంటున్రు. ఆటోమేటిక్ టాటర్ ఏసివస్తే పొలాలు పారుతున్నయి. గిప్పుడు ఏమైనా పుల్లలు పెడితే ఆ పార్టోళ్లను తరిమికొడుతం.
– ఎక్కలదేవి రవి, రైతు, బావుసాయిపేట (కోనరావుపేట)
కరెంటు, నీటికి తిప్పలు తప్పినయ్
మా ఊరు పక్క నుంచే వరదకాలువ వెళ్తుంది. పదేండ్ల కిందట గుంట భూమి రూ.నాలుగు వేలుండె. ఇప్పుడు గుంట భూమి రూ.లక్ష పలుకుతంది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని రైతుల భూములకు విలువచ్చింది. నీళ్లు ఎత్తిపోయడంతో వరదకాలువ నిండా నీళ్లున్నయి. వానలు లేకున్నా వరినాట్లు జోరుగా నడుస్తున్నయి. ఎవుసానికి ఉచిత కరెంటు వస్తంది.. సాగునీటికి తిప్పలు తప్పినయ్.. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందుతంది.. ఎరువుల కొరత లేదు. ఇప్పుడు వ్యవసాయం గిట్టుబాటైతంది. నా బిడ్డకు రూ.కోటి కట్నం పోసే స్థాయికి ఎదిగిన అని గర్వంగ చెప్పుకుంటున్న. ఇదంతా కేసీఆర్ పుణ్యంతోనే. ఎత్తిపోతలు జరుగుతలేవంటున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు మా ఊరు వరదకాలువల దుంకితే నీళ్లు మీదికి పోతున్నయా.. కింది పక్క పోతున్నయా తెలుస్తది. ఎవుసానికి మూడు గంటల కరెంటు సరిపోతుందన్న రేవంత్‌రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలె.
– పాలెపు రాజగంగారాం, రైతు, రామలచ్చక్కపేట(మెట్‌పల్లిరూరల్)
నాడు కరెంటు లేక నేలలు నెర్రెలు బారినయ్…
నాకు పదెకరాల భూమి ఉంది. 30 ఏండ్ల నుంచి ఎవుసం చేస్తున్న. నాడు కరెంటు కోసం కావలిపోయెటోళ్లం. పొలం కాడికి సద్దికట్టుకుని పోయి రాత్రింబవళ్లు అక్కడే ఉండి పొలాలు పారించుకొనేటోళ్లం. ఏడు గంటల కరెంటు ఇస్తే పొద్దుగాల వస్తదా?, పొద్దూకినంక వస్తదా? తెలువక పోయేది. కరెంటు వచ్చినంక పెడితే కాలువ సాగి పది గుంటల మడి పట్టేది. ఇగ బాయిలున్న నీళ్లు దంగిపోయేవి. మళ్లీ బాయిల నీళ్లు ఊరేసరికి కరెంటు పోయేది. ఇగ గిట్ల కరెంటుతో అరిగోసపడ్డం. కరెంటు అచ్చుడు పోవుడుకు మోటర్లు కాలుతుండె. దీంతో శానా తిప్పలయ్యేది. కరెంటు రాకపోతే రోడ్డు మీద కూసుండి ధర్నాలు చేసేటోళ్లం. ఇగ సీఎం కేసీఆర్ సారు చేయవట్టి నీళ్లగోస, కరెంటు గోస పూర్తిగ తప్పింది. 24 గంటల కరెంటును ఇస్తుండ్రు. రంది లేకుండ ఎవుసం చేసుకుంటున్నం.
– ఊరడి తిరుపతియాదవ్, రైతు, బావుసాయిపేట (కోనరావుపేట)
నోటికి ఏదత్తే అది మాట్లాడుతున్నడు
రేవంత్‌రెడ్డి నోటికి ఏదత్తే అది మాట్లాడుతున్నడు. అట్లాంటి వ్యక్తి అసలు రైతే కాదు. మూడు గంటల కరెంటు సరిపోదని చెప్పుతుండంటే అతను కడుపులకు గడ్డి తిన్నట్టే లెక్క. మూడెకరాల భూమి ఉన్న రైతుకు మూడు గంటల కరెంటిస్తే, కనీసం పది గుంటలన్న పారది. కాంగ్రెసోళ్ల చీకటి పాలన అంతమై సీఎం కేసీఆర్ హయాంల రైతులు మంచిగ పంటలు పండిస్తున్నరు. నోటికాడికి బుక్కెడు బువ్వ వస్తుందంటే అది కేవలం తెలంగాణ సర్కారు దయనే. గతంల రైతులు మందు బస్తాలకోసం చెప్పులు, తువ్వాలలను లైన్లవెట్టి గంటలకొద్ది నిల్చొని అరిగోసవడి తెచ్చుకునెటోళ్లు. ఇప్పుడు మందు బస్తాలు పల్లెటూళ్లల్లో కూడా దొరుకుతున్నయ్. అన్ని ఊళ్లల్లో రైతులు సంతోషంగ బతుకుతండ్రు.
– సుద్దాల మల్లేశంగౌడ్, రైతు, గోపాల్రావుపేట (రామడుగు)
24గంటల కరెంటుతోని కష్టాలు తీరినై..
తెలంగాణ వచ్చినంక కరెంటు కష్టాలు తీరినయ్. సీఎం కేసీఆర్ సారు రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా 24 గంటల కరెంటు ఉచితంగనే ఇస్తుండు. దీంతో బాయికాడికి ఎప్పుడు వీలైతే అప్పుడు పోయి నీళ్లు పారిస్తున్నం. నాడు గడియగడియకు కరెంటు పోయేది. దీంతో నానా అవస్థలు పడ్డం. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతోపాటు అనేక పనులు చేసిండు. దీంతో రైతులు ఎక్కడ కూడా గుంట భూమి ఖాళీ లేకుండా సాగు చేస్తుండ్రు. మళ్లీ కాంగ్రెసోళ్లు వస్తే కరెంటు కష్టాలు వస్తయ్. కాంగ్రెసోళ్ల మాటలు ఎవ్వరూ వినరు. గింత మంచి ప్రభుత్వం ఉన్నంక రైతులకు ఢోకా లేదు. మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తది.
– సుంక భూమయ్య, రైతు, వట్టిమల్లగొల్లపల్లి (కోనరావుపేట)
ఎవుసం జేసెటోనికి తెల్తది
తెలంగాణ రాకముందు మా ముగ్గురన్నదమ్ములం రాత్రిపూట పొలంకాడ పండుకొని కరెంటు ఎప్పుడత్తె అప్పుడు పొలానికి నీళ్లు పెట్టుకునేటోళ్ళం. గంటగంటకూ షిఫ్టులు పెట్టి కరెంటు తీసేసెటోళ్లు. మల్ల కరెంటు ఎప్పుడత్తదా అని ఎదురు చూసెటోళ్లం. పొలమంతా నీళ్లు పారాలంటే తెల్లందాక.. పొద్దుందాక పొలంకాడనే ఉండెటోళ్లం. ఇప్పుడు మూడుగంటల కరెంటు చాలని రేవంత్‌రెడ్డి అంటే ఎట్ల సాల్తదో ఆయనే చెప్పాలె. మూడు గంటల కరెంటుతోని ఒక్క మడి కూడా పారది. ఎవుసం జేసెటోనికి కరెంటు గురించి తెల్తదిగనీ, ఉత్త మాటలు మాట్లాడేటోనికి ఏందెల్తది.
– జుట్టు లచ్చయ్య, రైతు, చిప్పకుర్తి (రామడుగు)
కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డం
65 ఏండ్ల కాంగ్రెస్ పాలనల రైతులమంతా అరిగోసపడ్డం. ఓ వైపు సాగునీరు లేక, మరో వైపు కరెంటు లేక పంటలు పండియ్యడానికి నానా అవస్థలు ఎల్లదీసినం. పంటలకు సక్కగ నీళ్లు ఉండకపోయేవి. ఉన్న నీళ్లను పొలం మడికి పారిద్దామంటే కరెంటు రాకపోయేది. గిట్ల అప్పుల పాలై శానా ఏండ్లు ఇంట్లోళ్లను వదిలి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినం. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్రు. ఇగ గిప్పుడు చంద్రబాబుతో తిరిగినోడు కరెంటు గురించి మాట్లాడవట్టె. మంచిగున్న తెలంగాణల గిసోంటోడు చేయవట్టి లొల్లిలు పుడుతున్నయ్. గీళ్లకు సపోటు చేసేటోన్ని ఊళ్లల్ల తిరగనియ్యం.
– ముష్కం గంగాధర్, రైతు, బావుసాయిపేట (కోనరావుపేట)
నాడు రైతుల సావుజూసిన్రు
తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ప్రభుత్వం కావాల్సినంత కరెంటిచ్చి రైతులను ఆదుకున్నది. గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలె. రైతులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులకు సాగునీరు, కరెంటు తప్ప ఇంకేం కావాలి. ఆ రెండింటినే నాటి ప్రభుత్వాలు మరిచిపోయినయ్. సాగునీరు లేక రైతులు అరిగోస పడ్డరు. ఏ రాత్రో కరెంటిచ్చి అన్నదాతల సావుజూసిన్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మాకు పుష్కలంగా సాగునీరందుతంది. కేసీఆర్ సర్కారు 24 కరెంటు ఇస్తంది. పంటలు మంచిగ పండుతన్నయ్. రైతులకు ఏ బాధలేదు.
– కర్ర రాజిరెడ్డి రైతు, గోపాల్రావుపేట(రామడుగు)
సీఎం కేసీఆర్‌తోనే ఎవుసం పండుగైంది
ఒకప్పుడు ఎవుసం చేస్తే దండుగ అనేటోళ్లు. తెలంగాణ అచ్చినంక, కేసీఆర్ సీఎం అయినంక పండుగలా మారింది. అంతకుముందు రైతుల గోసలు చెప్పలేనివి. కరెంట్ ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. లోఓల్టేజీతో రైతులం అనేక సమస్యలు ఎదుర్కొన్నం. మోటర్లు కాలిపోయి నష్టాలు చూసినం. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని రైతులకు తెలుసు. రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ ఇస్తే చాలంటుండు. గట్లయితే ఇగ రైతులెవరూ వ్యవసాయం చేసుడుండదు. మల్లా భూములు పడావు పెట్టి కైకిలి, కూలి పోవాలే. రేవంత్‌రెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఓట్ల కోసం వచ్చే కాంగ్రెసోళ్లను గ్రామాల్లోకి రానీయం.
– అమ్ముల భిక్షపతియాదవ్, ఏఎంసీ డైరెక్టర్, హరిపురం (ఓదెల)
రాత్రి పోయి నీళ్లు కట్టేటోళ్లం..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా రైతుల బాధలు తీరినయి. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ కోసం ఎన్నో బాధలు పడ్డం. కరెంట్ ఎప్పుడస్తదో.. పోతదో తెలువదాయె.. రాత్రిళ్లు పొలం కాడికి పోయి నీళ్లు కట్టేటోళ్లం. ఆ బాధలు తలుచుకుంటనే దుఃఖమస్తది. కేసీఆర్ సారు మాకు నిరంతర కరెంట్ ఇస్తండు. ఇప్పుడిప్పడే ఎవుసం బాగుడపడుతంది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తంది. అది అయ్యే పనికాదు. రైతులను అన్ని రకాల మంచిగ చూసుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకుంటాం.
– మహిళా రైతు సునీత, ఖాసింపేట(తిమ్మాపూర్)
నిజం అబద్ధమైతదా.?
“నిజాన్ని అబద్దం చేస్తున్నవ్.. సిగ్గనిపిస్త లేదా.. కరెంట్ మూడు గంటలే ఇస్తే పంటలు ఎట్ల పండిస్తం.. మేమెట్ల బతుకుతం. నీళ్లు ఎంత వరకు ఉన్నయో.. పారే భూమి ఎంతున్నదో.. దానికి సరిపడా కరెంట్ వస్తున్నదా లేదా.. కేసీఆర్ సర్కార్ ఇచ్చే కరెంట్‌తోని రైతుల భూములన్నీ పారుతున్నయా లేదా.. కరెంట్ లేక ఏన్నన్న గుంట భూమన్నా ఎండిందా.. మునుపటి లెక్క బీడు వడి ఉంటున్నయా.. పదెకరాలున్న పెద్ద రైతు భూమి పారుతంది. ఎకరం ఉన్న చిన్న రైతు భూమి పారుతంది. కరెంట్ వస్తలేదని అబద్ధ్దం ఎట్ల చెప్తున్నవ్. ఊళ్లె రచ్చబండ కాడ నిలవడ్డప్పుడు కాంగ్రెసోళ్లతోని ఈ విషయాల మీద వాదించుకోవాలె. ఓట్లు దండుకునేతానికే వాళ్లు (కాంగ్రెస్ నాయకులు) ఇసోంటి మాటలు మాట్లాడుతున్నరు. ఇంత మంచి కరెంట్ ఎవరిస్తున్నరు. పారే నీళ్లు కనిపిస్తున్నయ్. పండే పంటలు కనిపిస్తున్నయ్.. ఇంకేంగావాలె.. కరెంట్ గురించి ఎవరు అడిగిన్రు. మాకు వస్తలేదని చెప్పినమా. ఎందుకింత రాద్ధాతం చేస్తున్నరు. ఆయనకు (రేవంత్ రెడ్డి) తగిన బుద్ధి చెప్పక తప్పదు”
ఇదీ గన్నేరువరం మండలం ఖాసీంపేటకు చెందిన పీచు మల్లారెడ్డి అనే రైతు తమ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలు. ఈ ఆవేదన ఒక్క మల్లారెడ్డిదే కాదు. 24 గంటల ఉచిత కరెంట్‌తో పుష్కలంగా పంటలు పండిస్తున్న ప్రతీ రైతుది. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలపై రైతుల ఆగ్రహం చల్లారడం లేదనడానికి మల్లారెడ్డి వంటి ఎందరో రైతుల ఆవేదనే నిదర్శనం.