‘ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టు’ అన్న సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఒక్కో వర్గానికి మొండిచేయి చూపుతున్నది. తాము ఉద్యోగుల సంక్షేమంపై ప్రధాన దృష్టి పెడుతామంటూ ఊదరగొట్టడమే కాదు, ఏకంగా మేనిఫెస్టోలో ప్రకటించి, గద్దెనెక్కిన తర్వాత ఆ మాటను మరిచింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను అధికారం చేపట్టిన వెంటనే చెల్లిస్తామని చెప్పి, ప్రస్తుతం ఆ సంఖ్య ఐదు డీఏలకు చేరినా. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ఇదొక్కటే కాదు, ఉద్యోగులకు చెందిన అనేక సమస్యలపై స్పందించకుండా.. దాటవేత ధోరణి అవలంభిస్తుండగా.. ఈ దసరాకైనా డీఏలు ఇస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఫలితంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఆయా ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణవైపు అడుగులు వేస్తున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రధానంగా పెడింగ్‌లో ఉన్న మూడు డీఏలను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే డీఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు ఇస్తామని కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోగా సిఫారసుల అమలు చేస్తామని గొప్పలు చెప్పింది. ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు అన్ని దవాఖానల్లో వైద్యం అందించేలా హెల్త్ కార్డు జారీ చేస్తామన్నది. వీటితోపాటు అనేక హామీల వర్షం కురిపించింది. కానీ, గద్దెనెక్కగానే అవన్నీ మరిచిపోయినట్టు కనిపిస్తున్నది.
కాంగ్రెస్ హామీలను నమ్మిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లంతా ఆనాడు ఒక్కటై మద్దతు ప్రకటించారు. పద కొండు నెలల క్రితం ఆ పార్టీ అధికారంలోకి రాగా, ఇక తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించారు. నేడో, రేపో తమను చర్చలకు పిలుస్తుందనే ఆశతో ఉద్యోగ సంఘాల నాయకులు వేచి చూశారు. అయితే, ‘అనుకున్నదొకటి అయింది మరోకటి’ అన్నట్టు మారింది పరిస్థితి. కొత్త హామీలు దేవుడెరుగు.. మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు కూడా అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతుండడంతో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఆశ పడి తాము మోసపోయామన్న అభిప్రాయాలను ప్రస్తుతం ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, కొంత మంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానూ ఎండగడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసి పాలన గాడిలో పడ్డది, ఇక తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందనుకుంటే, కనీసం పెండింగ్ డీఏలు కూడా చెల్లించకుండా పదకొండు నెలల నుంచి సతాయిస్తున్నదని విమర్శిస్తున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విడుదల చేసిన రెండు డీఏలు కూడా చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంపైనా నిరసన పెల్లుబికుతున్నది. దసరాకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్టు అనధికారిక సమాచారం రావడంతో విజయదశిమి బొనాంజా ఖాయమనే ధీమా ఉద్యోగులు, పెన్షనర్లలో వ్యక్తమైంది. మరొక రోజులో దసరా పండుగ కూడా దాటిపోనుండగా, డీఏల విడుదలపై ఆరా తీస్తే.. ప్రభుత్వ పరిస్థితి మీరే చూస్తున్నారుగా అంటూ అధికార నేతలు తమపై వ్యంగ్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగులు ఇచ్చిన అల్టిమేటాన్ని సైతం పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. దీంతో దసరా అనంతరం ఉద్యమ కార్యాచరణ వెల్లడిస్తామని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర నాయకులు ఇప్పటికే ప్రకటించారు. అయినా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేకపోవడంపై ఆయా వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. తమకు వచ్చే అరకొర పెన్షన్‌తోనే తాము నెలంతా గడుపుతున్నామని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో కనీసం మూడింటిని చెల్లించినా తాము దసరా పండుగ సంతోషంగా జరుపుకొనేవాళ్లమని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దసరా పండుగ ఉమ్మడి జిల్లా పరిధిలో 53వేలకు పైగా ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం నింపే పరిస్థితి కనపడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతున్నదని ఆయా సంఘాలు ప్రతినిధులు వాపోతున్నారు.
నిజానికి మిగిలిన అంశాలను పక్కన పెడితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత నుంచి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీఏలను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అంతేకాదు, హైదరాబాద్‌లాంటి నగరంలో ప్రెస్‌మీట్ పెట్టి తమ నిరసన తెలిపాయి. అక్కడితో ఆగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు కనిపించిన ప్రతి మంత్రికీ విన్నవిస్తూ వచ్చాయి. చాలా సందర్భాల్లో వినతిపత్రాలు సమర్పించాయి. ఈ నేపథ్యంలో మిగిలిన సమస్యల మాట పక్కన పెడితే ఈ దసరాకు కనీసం రెండు డీఏలు చెల్లించే అవకాశాలున్నాయంటూ జరిగిన ప్రచారంతో ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈ రెండు డీఏలు వచ్చినా.. మిగిలిన వాటి కోసం పండుగ తర్వాత పోరాటం చేయవచ్చని సంఘాల నాయకులు భావించారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఈ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అంతేకాదు, ఇప్పట్లో డీఏలు ఇచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఈ విషయంపై ఇప్పటివరకు సర్కారు స్పష్టత ఇవ్వలేదు. నిజానికి ఈ దసరాకు వస్తాయన్న ఆశతో ఎదురుచూసిన ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టే కనిపిస్తున్నది. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో.. ఇచ్చిన హామీలు అటకెక్కినట్టేనా..? అన్న అనుమానాలు ఉద్యోగుల్లో తలెత్తుతున్నాయి. నిజానికి పండుగ పూట సంతోషంగా గడపాల్సిన వారి మోముల్లో నైరాశ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో కేవలం ఒకటో తేదీన వేతనం విడుదల చేయడం తప్ప, మిగతావన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వమని ఆరు నెలల దాకా మేనిఫెస్టోలోని హామీలు అడుగలేదు. ఇప్పటివరకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కనీసం మూడింటినైనా చెల్లిస్తే తమ కుటుంబాలు దసరా పండుగను సంతోషంగా జరుపుకొనేవి. కానీ, ప్రభుత్వం తమను పట్టించుకోక పోవడం దారుణం. ఏ ప్రభుత్వమైనా పెండింగ్ సమస్యలపై ఉద్యోగ సంఘాలను పిలిచి, మాట్లాడి పరిష్కరించేవి. ఆలస్యమైనా దసరా కానుకగానైనా తమకు పెండింగ్ డీఏలు చెల్లిస్తుందనే ఆశతో ఉన్నాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం శోచనీయం. దీనిపై దసరా అనంతరం ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మరోసారి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం మమ్మల్ని మోసం చేయడమే. ఇచ్చిన మాట నిలుపుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. మేనిఫెస్టో చూసి మేమంతా కాంగ్రెస్ వైపు మొగ్గితే, ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టు ఉన్నది మా కుటుంబాల పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన రెండు డీఏలు కూడా చెల్లించకుండా పదకొండు నెలల నుంచి సతాయించడం దారుణం. అడిగినప్పుడల్లా ఇదిగో, అదిగో అంటూ దాటవేయడమే తప్ప, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతున్నది. సీనియర్ సిటిజన్లకు ఈ ప్రభుత్వ హయాంలో కనీస గౌరవం లేదు. వారి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నది. అంతంత మాత్రంగానే వస్తున్న పెన్షన్‌తో విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి.