Sircilla | సిరిసిల్ల టౌన్, జనవరి 29 : అబద్దపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు అనే ఆయుదంతో మున్సిపల్ ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డుల ఇన్చార్జి నాయకులు పట్టణంలోని 39వార్డులలో ఇంటింటి ప్రచారం చేశారు.
గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన పట్టణ ప్రగతి నివేదిక ప్రతులను పంపిణీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పదేండ్ల కేటీఆర్ నేతృత్వంలో సిరిసిల్లలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి పనులు జరిగాయని ప్రజలకు వివరించారు.
అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలను సమపాల్లలో ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు కేటీఆర్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడుస్తున్న ఇచ్చిన ఏ ఒక్క హామిని అమలు చేయలేదని విమర్శించారు. అబద్దాల పునాదులపై అధికారం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలలో తగిన బుద్దిచెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వార్డు ఇంచార్జిలు, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.