మానకొండూర్, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, ఏడాదిలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, 420 హామీలు గాలిలో కలిశాయని, ఆ పార్టీపై ప్రజలకు విశ్వాసం పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటేనే ముఖ్యమంత్రి భయపడుతున్నారని, జిల్లాల పర్యటన అంటేనే జంకుతున్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదని విమర్శించారు. మానకొండూర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీపై చేసిన విమర్శలను ఖండించారు. మహేశ్‌కు రాజకీయాలపై అవగాహన లేదని, రేవంత్‌రెడ్డిని జోకితేనే ఆయనకు పీసీసీ పదవి వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, గతంలో 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉండేదని, ఇప్పుడు మూడు రాష్ర్టాలకే పరిమితమైందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజీపీ లోపాయికారి ఒప్పందంతో ఆప్ పార్టీ ఓటమి చవిచూసిందన్నారు. ఆప్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పామని రేవంత్‌రెడ్డి మాట్లాడడమే అందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని, దీనిపై కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, బీఆర్ఎస్వీ నియోజక కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, నాయకులు రామంచ గోపాల్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, దండబోయిన శేఖర్, పిట్టల మధు, రాచకట్ల వెంకటస్వామి, గడ్డం సంపత్, ఇస్కుల్ల అంజయ్య, కొండ్ర వెంకటస్వామి పాల్గొన్నారు.