Rasamai Balakishan | మానకొండూరు రూరల్, నవంబర్ 24 : కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని రంగాల్లో నట్టేట ముంచుతోందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని రంగాల్లో మోసం చేస్తుందని, పత్తి పంటకు ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే 7 క్వింటాలే కొనుగోలు చేస్తామని అనడం జరుగుతుందని, 60 శాతం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నదని, త్వరితగతిన కొనుగోల్లను వేగవంతం చేయాలని కోరారు.
ఇక మానకొండూర్ నియోజకవర్గానికి వస్తే 6 మండలాల్లోని ప్రజలు రోడ్లను మరమ్మతులు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాత్రం తన ఊటూరు ఇసుక క్వారీకి రోడ్డు వేసుకున్నారని మండిపడ్డారు. తిమ్మాపూర్ మండలంలోని కొత్తపెళ్లి వాగులో నీటి నుండి ఇసుకను తీసి అమ్ముకున్న ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలానే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 30శాతం వాటా తీసుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు ఇచ్చేది కానీ, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని చెప్పి మహిళా సంఘాలకు యూనిఫాం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నాయకులు పాశం అశోక్ రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, కమటం సంపత్, సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.