ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలోని హస్తం పార్టీలో అగ్గి రాజుకుంది. మున్సిపల్ ఎన్నికల వేదికగా ప్రారంభమైన ఈ రగడ రోజురోజుకూ పెరుగుతోంది. సొంత పార్టీ వాళ్లే తమకు వ్యతిరేకంగా పనిచేసి ఓటమికి కారకులయ్యారంటూ ఇప్పటికే పలువురు నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేయగా, మరికొంత మంది అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఒకే సామాజిక వర్గానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు రగులుతుండగా.. తాజాగా, ఆది శ్రీనివాస్‌కు సంబంధించి లీకైన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండేళ్లుగా వార్డుల్లో ఎదిగే అవకాశం కల్పించినా ఎన్నికల్లో గెలువలేదని, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లే గెలిచారంటూ సొంత పార్టీ వాళ్లు చిన్న బుచ్చుకునే రీతిలో ఆది మాట్లాడిన ఆడియో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అదే నిజమైతే విప్ నివాసం ఉండే వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారకులెవ్వరన్న ప్రశ్నలు హస్తం నాయకుల నుంచి ఉత్పన్నమవుతుండగా, సొంత పార్టీకి చెందిన ఓ నాయకుడిపై అసహనం వ్యక్తం చేస్తూ ఆది మాట్లాడిన ఆడియో వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆ పార్టీలో బిగ్ టాపిక్‌గా మారింది.
కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలోని హస్తం పార్టీలో ముసలం మొదలైంది. వేములవాడ మున్సిపల్లో 28 వార్డులకు గానూ 13 స్థానాలను మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను అనైతికంగా పార్టీలో చేర్చుకొని, ఇండిపెండెంట్ల మద్దతుతో గద్దెనెక్కిన తీరుతోపాటు పార్టీలో నెలకొన్న పలు పరిణామాలు కాంగ్రెస్‌లో అగ్గిరాజుకోవడానికి కారణమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం నుంచి పోటీ చేసిన మెజార్టీ అభ్యర్థుల ఓటమికి సొంత పార్టీ నాయకులే కారణమయ్యారని, ప్రత్యర్థుల తరఫున ప్రచారం చేసిన సాక్ష్యాలు ఉన్నాయంటూ కొంత మంది ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వేడి మరింత పెరిగేందుకు వేదికైంది. అలాగే, మున్సిపల్ ఎన్నికల తదుపరి అతి ముఖ్యమైన రెండు పదవులను ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికే కట్టబెట్టారన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఆది శ్రీనివాస్ నివాసం ఉండే వార్డులో కాంగ్రెస్ ఓటమి, సొంత పార్టీ నాయకులే సీనియర్లను ఓడించడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రధాన పదవులు కట్టబెట్టడం వంటి వాటిపై సొంత పార్టీ నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో ఆది శ్రీనివాస్ అసహనానికి లోనవుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలోనే ఇటీవల ఓ మండలంలో జరిగిన కార్యక్రమం అనంతరం పార్టీ నాయకుడికి వివరించే క్రమంలో ఆది సొంత పార్టీ నాయకుడిపై సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియో ఒకటి వైరల్ కావడం వీటికి నిదర్శనంగా నిలుస్తోంది.
వేములవాడ పురపాలక సంఘంలో ఏడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాగరం వెంకటస్వామి ఓటమి పాలయ్యారు. పార్టీలోని కొంత మంది నాయకులే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి తన ఓటమికి కారణమయ్యారంటూ ఆయన ఇటీవల పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో క్రమశిక్షణ గల సీనియర్ నాయకుడిగా ఉన్న తనను ఓడించేందుకు కుట్రలు పన్నిన నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆధారాలతో ఫిర్యాదు చేసిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అలాగే, 21వ వార్డులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మస్తాన్‌కు వెన్నంటే ఉన్న ఆ పార్టీ ముఖ్య నాయకులు, వార్డులోని ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన కొంత మంది నాయకులు పార్టీకి మద్దతుగా నిలుస్తున్నట్లుగా నమ్మించి మరో పార్టీకి ఓట్లు వేశారని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు మంత్రి నాగభూషణం సతీమణి సూగూరి లక్ష్మి కూడా ఓటమిపాలైంది. కాగా, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన కుమ్మరి శిరీషను మంత్రి నాగభూషణంకు సమాచారం లేకుండానే పార్టీలోకి తీసుకున్నారన్న చర్చ నడుస్తోంది. పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తున్న తనకు కనీస గౌరవం ఇవ్వకుండా, మాట మాత్రమైనా చెప్పుకుండా ఎలా చేర్చుకుంటారనని ఆయన ఆవేదనతో రగులుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీకి కట్టుబడి పని చేసి ఓటమి పాలైన తర్వాత కనీసం పలుకరింపు లేకపోగా.. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తమను ప్రతీసారి ప్రతిఘటించిన వ్యక్తులనే అధికారం వైపు తీసుకువచ్చి గద్దెనెక్కిస్తుస్తూ.. తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నట్లుగా పార్టీలో వాడీవేడి చర్చ జరుగుతోంది.
ఆది శ్రీనివాస్‌కు సంబంధించి తాజాగా లీకైన ఓ ఆడియో ప్రస్తుతం ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీతోపాటు రెండు ప్రాధాన్యత పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టిన తీరుపై వస్తున్న విమర్శలను చెప్పేందుకు ఇటీవల ఓ చోట సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఆది శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో లీక్ అయింది. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన అభ్యర్థులే విజయం సాధించారంటూ సాక్షాత్తూ ప్రభుత్వ విప్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మొత్తం 28 వార్డుల్లో పోటీచేయగా, కాంగ్రెస్ 13 స్థానాల్లో విజయం సాధిస్తే అందులో 10 మంది బీఆర్ఎస్ నుంచి తీసుకున్న కొత్త ముఖాలే గెలిచాయంటూ అందులో ఆది చెప్పిన తీరు ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. “ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి, వార్డుల్లో ఎదిగేలా రెండేళ్లు ప్రయత్నించినా మీరు ఆ స్థాయికి ఎదగకపోతే అది నాదా తప్పు’ అంటూ ప్రశ్నించారు. వేములవాడ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టడంపై సొంత పార్టీలోని శ్రేణుల మధ్య విస్తృత చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఆది శ్రీనివాస్ పార్టీ నాయకులకు వివరించేందుకు ప్రయత్నం చేస్తూనే పలుమార్లు అసహనానికి లోనయ్యారు. ఒకే సామాజిక వర్గానికి రెండు పదవులు ఇచ్చారని తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ ఆయన, రెండేళ్లుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్నా నాయకులు, కార్యకర్తలు ఎదగలేదని సొంత పార్టీ నాయకులను తప్పుబట్టిన తీరు ఆ పార్టీలో దుమారం రేపుతోంది. గెలిచిన 13 స్థానాలతో ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలన్న తపనతో ఇతర పార్టీ కౌన్సిలర్లను కాంగ్రెస్‌లోకి తీసుకుని పదవులు కట్టబెడితే ఈ దుష్ప్రచారం ఏంటంటూ ఓ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆయన సహనం కోల్పోయినట్లుగా ఆడియో వింటే అర్థమవుతోంది. అసలు చేయని తప్పుకు తనపై ఎందుకు కోపానికి వస్తున్నారని, తాను ఇంకో ప్రశ్న అడిగితే మీరు ఇంకో దాని గురించి ఎందుకు అడుగుతున్నారని సదరు నాయకుడు ఎమ్మెల్యేను అడుగుతున్న క్రమంలో ఆది మరింత ఆగ్రహావేశానికి లోనైన ఆడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సొంత పార్టీ నాయకులకు నచ్చజెప్పాల్సిందిపోయి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు ఆ పార్టీలోని శ్రేణులను అంతర్మథనంలో పడేసింది.