వేములవాడ, జూన్ 23: ధాన్యం కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని, అందులో కాంగ్రెస్ నాయకులదే ప్రధాన పాత్ర అని రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు. ఈ స్కాంలో ఇప్పటివరకు బయటపడింది రవ్వంతేనని, లోతైన విచారణ జరిపితే అవినీతి గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో ధాన్యం విక్రయించిన రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఆది శ్రీనివాస్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించి, నిజాయితీని చాటుకోవాలని హితవు పలికారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ లక్ష్మీనరసింహారావు నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనడానికి రాని చేతులు, కోట్లాది రూపాయల కుంభకోణాలకు ముందుకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో ఆయన ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ నాయకుడు స్వామి అలియాస్ గడ్డం నర్సారెడ్డి నకిలీ ట్రక్ షీట్లతో రెండు లారీల ధాన్యం అమ్మినట్టు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారని చెప్పారు.
రుద్రంగిలో జరిగిన ధాన్యం, మకల కొనుగోళ్లలో లోతైన విచారణ చేస్తే ధాన్యంతోపాటు మకలు కూడా ఇదే తరహాలో నకిలీ పత్రాలు సృష్టించి అమ్మినట్టు వెలుగులోకి వస్తుందని ఆరోపించారు. స్వామి ఆదికి ముఖ్య అనుచరుడు కావడంతోనే రుద్రంగిలో డీసీఎంఎస్ ద్వారా ప్రత్యేక ధాన్యం, మకల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. నియోజకవర్గ కేంద్రమైన వేములవాడలోనే కాకుండా రుద్రంగిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం చూస్తే ఆయనకు సన్నిహితుడనే విషయం బహిర్గతమవుతున్నదని స్పష్టం చేశారు. మలపేట శ్రీనివాస్, నర్సారెడ్డి కాంగ్రెస్ అనుచరులు అనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ ఆది శ్రీనివాస్‌తోపాటు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న ఫొటోలు, వార్తాపత్రికల క్లిప్పులను చూపారు. గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్టు కాంగ్రెస్ నాయకుల తీరు ఉందని ఎద్దేవా చేశారు.
దొంగలు దొరికాక ఇప్పుడు తమ వాళ్లు కాదని కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశాలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇవన్నీ వదిలేసి బీసీ బిడ్డ ఎదిగితే చూడలేక ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డగా ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి వస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు. కానీ, అవినీతి జరిగినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్లు జలగం కిషన్ రావు, రామ్మోహన్ రావు, తిప్పని శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు గడ్డం హన్మండ్లు, గోసుల రవి, డప్పుల అశోక్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, చంద్రయ్య గౌడ్, పట్టణ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, గోలి మహేశ్, నాయకులు తదితరులు ఉన్నారు.
కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం
బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం. వార్తా పత్రికలలో వచ్చిన కథనాలను సామాజిక మాధ్యమాల్లో పెడితే కార్యకర్తలను అర్ధరాత్రి కూడా అని చూడకుండా పోలీసులు వేధిస్తున్నరు. చందుర్తి మండలంలోని బండపల్లి గ్రామానికి చెందిన కార్యకర్త సురేశ్‌ను దివ్యాంగుడు కూడా అని కూడా చూడకుండా రాత్రి అదుపులోకి తీసుకున్నరు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మా పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నరు. ఇవి పోలీసులకు కనిపించడం లేదా? కక్ష సాధింపులకు దిగడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు.
– న్యాలకొండ అరుణ
మేం వడ్లు పంపిన లారీలోనే మలపేటకు వచ్చినయ్
ధర్మారం, కొలనూర్ కొనుగోలు కేంద్రాల నుంచి 815 వడ్ల బస్తాలను లారీ (టీఎస్ 05 యూఏ 5999)లో సిరిసిల్ల అపారెల్ పార్కుకు తరలించినం. తిరిగి ఇదే లారీలో దొంగతనంగా 89 వడ్ల బస్తాలు మలపేటకు వచ్చినయి. పోలీసులు కూడా నిర్ధారించిన్రు. ఐకేపీ సెంటర్ నిర్వాహకుడితో కాంగ్రెస్‌కు సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నరు. ఇప్పటికే పలు గ్రామాల్లో తూకం వేసిన ధాన్యం సంబంధించిన లారీల ట్రక్ షీట్లు తిరిగి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నరు. అసలు లారీలు ఉన్నాయా..? మాయం అయ్యాయా..? అనే విషయాన్ని నిర్ధారించాలి. రైతులకు న్యాయం చేయాలి.
– కొలనూరు సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు
అక్రమాలు చేసేందుకే ఇంకో కేంద్రం
సనుగుల సహకార సంఘం ఆధ్వర్యంలో రుద్రంగి మారెట్ కమిటీలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినం. మేం ఏడేళ్లుగా రైతులకు సేవలందిస్తున్నం. అయినా ఇటీవలే డీసీఎంస్ ద్వారా మరో కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏర్పాటు చేయించిండు. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నం. కానీ, అక్రమాలు చేసేందుకే ఇంకో కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఇప్పుడే తెలిసింది. నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన మక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఆయన అనుచరుడు స్వామి కోసం రుద్రంగిలోనే ఏర్పాటు చేసిన్రు. ఇప్పుడు కుంభకోణం బయటపడిన తర్వాత స్వామికి మాకు సంబంధం లేదని మాట్లడుతున్నరు.
-కిషన్ రావు, సనుగుల సింగిల్ విండో చైర్మన్