MLA Padi Kaushik Reddy | వీణవంక, అక్టోబర్ 4 : రాష్ట్రంలో రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన ఘనత దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామాలన్నిటికీ ఎగనామం పెట్టి రైతులను నడిరోడ్డుపై నిలబెట్టారని మండిపడ్డారు. ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి రోడ్డుపై నిలబెట్టిన ఘనత రేవంత్రెడ్డిదేనని, తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలతో 420 హామీలిచ్చి 420 ప్రభుత్వంగా ప్రజలముందు నిలబడిందన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ లేదని, రూ.2లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని, రైతుబంధులో విషయంలో కూడా రైతులను మోసం చేశారని విమర్శించారు.
రైతులకు బోనస్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అబివృద్ధిలో దూసుకపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం అదోగతి పాలవుతుందని పేర్కొన్నారు. కల్వల ప్రాజెక్ట్ పూర్తయితే ఎంతో మంది రైతులు లబ్ధిపొందుతారని, వెంటనే కల్వల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రేస్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను గమనిస్తున్నారని, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా చేసిందేమీలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఇక్కడ రెండు వర్గాలున్నాయని, బీఆర్ఎస్కు మాత్రం ఒక్క కేసీఆర్ వర్గం మాత్రమే ఉందన్నారు.
అసలు ఆ పార్టీలలో పోటీ చేసే అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెంది ఉన్నారని, ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రేస్కు తగిన గుణపాఠం చెప్తారని, ఇకపై జరిగే ప్రతీ ఎన్నికలోనూ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేస్తే విజయం తథ్యమని తెలిపారు.
బీఆర్ఎస్ లో చేరికలు
వీణవంక మండలంలోని వల్భాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరగా ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు, మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.