రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): సకల జనుల సంక్షేమాన్ని కాంక్షించేది గులాబీ జెండానేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆనాటి జలదృశ్యం నుంచి నేటి ఎల్కతుర్తిలో రజతోత్సవం దాకా గులాబీ జెండా పోరుబాట పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నదని, స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి సాధించి చూపించిన మహానాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు.
తొమ్మిదేళ్ల పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. తెలంగాణ సాధన కోసం పోరాడింది గులాబీ జెండానేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటం సమయంలో దేశంలో ప్రధానిగా ఇందిరాగాంధీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి హయాం లో 360 మంది విద్యార్థులను కాల్చివేసి, ఇనుపబూట్లతో తొక్కి ఉద్యమాన్ని అణిచివేశారన్నారు. అయినప్పటికీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో చెదిరిపోలేదన్నారు. 2001లో వరంగల్ కోర్టులో తాను న్యాయవాదిగా పనిచేస్తున్న రోజుల్లో ఏ పత్రికలో చూసినా తెలంగాణ పోరాటం గురించే వార్తలు వస్తుండేవన్నారు. రైతుల ఆత్మహత్యలు, మావోయిస్టులంటూ యువకుల్ని కాల్చిచంపిన వార్తలతో అలజడి ఉండేదన్నారు. తెలంగాణలో రక్తపాతం చూసి ఎందుకు ఈగోస అంటూ తీవ్రంగా బాధపడ్డ కేసీఆర్ పట్టుబట్టి రాష్ట్ర సాధనకు నడుంకట్టారని గుర్తు చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల గురించి కేసీఆర్ నాయకత్వాన పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే రాష్ట్రం ఏర్పాటైతేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావించారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్లో బిల్లు పాసైతేనే రాష్ర్టాలు ఏర్పాటవుతాయనే విషయాన్ని గుర్తించి చాలా మంది మేధావులు, మిత్రులు, రాజకీయ నాయకులతో చర్చించి పార్టీని స్థాపించినట్లు పేర్కొన్నారు. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యంలో జెండా ఎగురవేసి తెలంగాణ సాధన కోసం ఉద్యమించారని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల్లో అపనమ్మకాన్ని సృష్టించి దుష్ప్రచారం చేశారని, అవమానకర మాటలతో ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేశారన్నారు.
పార్టీ పెట్టక పోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ఎన్నో ఉద్యమాలు, అనేక మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలించి, రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమాలతో ముందుకు నడిపించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు. గులాబీ జెండానే తమకు అండగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఆబాసు పాలైందని మండిపడ్డారు.
ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, కాంగ్రెస్, బీజేపీలు అనేక సార్లు తమ పార్టీల పేర్లు మార్చుకున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, వేములవాడ బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, నాయకులు బొల్లి రామ్మోహన్, కుంబాల మల్లారెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.