మెట్పల్లి, జూలై 1 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా చేసింది శూన్యమని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. బుధవారం మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు వేములకుర్తి ఉపసర్పంచ్ బర్మ మల్లయ్యసహా పలువు రు వార్డుసభ్యులు బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకం, స్థానిక ఎమ్మె ల్యే సంజయ్‌పై ఉన్న విశ్వాసంతో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోతున్నారని, మళ్లీ ‘బీఆర్ఎస్ ప్రభుత్వం రావా లి.. కేసీఆర్ సీఎం కావాలి’ అని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను బలోపేతం చేస్తామని, ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతామని చెప్పారు. ఇక్కడ ఇబ్రహీంపట్నం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎలాల దశథరథరెడ్డి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు నోముల లక్ష్మారెడ్డి, డబ్బా మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య తదితరులున్నారు.