Sonia Gandhi | రామగిరి, జూన్ 2: అయ్యయ్యో… సోయి తప్పి… సోనియమ్మ పటానికే దండేసి దండం పెట్టారు కాంగ్రెస్ నాయకులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో సోమవారం కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం అటుంచు… ఏకంగా బతికుండగానే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ చిత్రపటానికి దండ వేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. అందరిలో కంటే ప్రత్యేకంగా చేయాలని తలచి తలవంపులు తెచ్చుకున్నారు. వీళ్ల తెలివి తెల్లారినట్లే ఉందంటూ పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి కామెంట్లు చేశారు. ఐతే ఈ సంఘటన స్థానికంగా దావనంలా వ్యాపించడంతో కాసేపటికి తేరుకొన్న కాంగ్రెస్ నాయకులు నాలిక కరుచుకొని జారుకున్నారు. కాంగ్రెస్ నాయకుల అభిమానం తలకిందులై బెడిసికొట్టడం మండలంలో చర్చనీయాంశమైంది.