గోదావరిఖని, ఫిబ్రవరి 12: కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి కేరాఫ్ అని, ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. తెలంగాణలోని బీసీలను అణగదొక్కేందుకే రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని, కులగణన నివేదిక అంతా తప్పుల తడక అని విమర్శించారు. రీ సర్వే చేయకుంటే బీసీల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బీసీ కులాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 14న గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ, ఉప కులాలు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు.
గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పూర్తిగా బీసీలకు అన్యాయం చేసేలా ఉందని మండిపడ్డారు. సర్వేను ఆ పార్టీకి సంబంధించిన నేతలే తప్పు పడుతున్నారని, అయినా మార్పు రావడం లేదని విమర్శించారు. బీసీ వర్గాలకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో సర్వే పేరిట బీసీ కులాల వర్గాలకు చేసిన అన్యాయంతోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. సర్వేలో ఐదున్నర శాతం బీసీ జనాభా తగ్గించి చూపిన రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ మాత్రమే బీసీలకు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించిందని గుర్తు చేశారు. సమావేశంలో నాయకులు గోపు ఐలయ్య యాదవ్, బొడ్డు రవీందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, అచ్చ వేణు, కల్వచర్ల కృష్ణవేణి, సట్టు శ్రీనివాస్, ఐలయ్య, సంధ్యారెడ్డి, రామకృష్ణ, వెంకన్న, కిరణ్, సారయ్య, వెంకటేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.