గోదావరిఖని, జూలై 8 : ‘తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నది. కేసీఆర్‌కు పేరు వస్తుందనే 30 నెలలుగా రాష్ర్టాన్ని ఎండబెడుతూ రైతుల నోట్లో మట్టికొడుతున్నది. రాష్ర్టానికి వరంలా మారిన మహత్తర ప్రాజెక్టుపై ఇంకెన్నాళ్లీ కుట్రలు?’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖనిలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలను పూర్తిస్థాయిలో అందించి ప్రతి ఎకరానికి సాగునీరు అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా 30 నెలలుగా ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తూ రాష్ర్టాన్ని ఆగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో వృథాగా పోతున్న జలాలను పరిశీలించేందుకు ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటనతో రేవంత్‌రెడ్డి దిమ్మతిరిగిందని, తాజాగా ఓ ప్రెస్మీట్లో చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడమే పాపమా..? అని సీఎంను ప్రశ్నించారు. రాష్ర్టాన్ని ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్ గోదావరిపై గతంలో ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు జాప్యం చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భగ్గుమన్నారు. ప్రస్తుతం వర్షాలు లేక కరువు తలపిస్తున్నదని, రైతులతో కలిసి బీఆర్ఎస్ ఉద్యమం చేపట్టకముందే ఆలస్యం చేయకుండా నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, మూల విజయారెడ్డి, అచ్చెవేణు, నూతి తిరుపతి, బొడ్డు రవీందర్, చింటూ, నారాయణదాసు మారుతి, దోమ్మిడి వాసు, గుండబోయిన సదయ్య, శ్రావణ్, వెంకటే, భానుప్రసాద్, కళ్యాణ్, ప్రతాప్, రవి శంక్, రాములు ఉన్నారు.