Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 12: ఇంతకాలం రామగుండం మేయర్ పీఠం తమదే ఉన్న ధీమాలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుగాలి తగిలింది. చాలా చోట్ల కారు దూసుకురావడంతో ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడేసింది. ప్రచారంకు చివరి రెండు రోజుల్లోనే సమీకరణలు ఒక్కసారిగా మారడం, బీఆర్ఎస్ పార్టీకి ఊహించని విధంగా గ్రాఫ్ పెరిగడంపై రామగుండంలో ప్రాధాన్యత అంశంగా మారింది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతుంది. పోలింగ్ అనంతరం కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయంగా తేలిపోయింది.
చాలా చోట్ల అధికార పార్టీకి బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు వస్తాయా?రావా అన్న సందిగ్ధత ఆ పార్టీ శ్రేణులను అంతర్మథనంలో పడేసింది. ఐతే అంచనాలు తారు మారు కావడానికి.. కారు జోరు పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయి? చివరి రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారిగా ప్రజల్లో ఆదరణ పెరగడానికి కారణం ఏమిటనేది రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీసింది. సింగరేణి కార్మికుల ఓట్లే ప్రభావం చూపాయా? అతి నమ్మకమే ఈ స్థాయికి తీసుకవచ్చిందా? టికెట్ల కేటాయింపులో జరిగిన స్వయంకృపరాదమా? అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం కల్లా అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుండగా ఈ రోజు ఏలా గడుస్తుందోనన్న గుబులు అందరిలో నెలకొంది. ఐతే ఇప్పుడు మేయర్ పీఠం దక్కించుకోవాలంటే స్వతంత్ర, ఏఐఎఫ్ బి, బీజేపీ అభ్యర్థుల మద్దతే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని ఆ పార్టీ శ్రేణుల్లో ధీమా వ్యక్తమవుతోంది. పోలింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్‌లలో కలియ తిరగడం, 57వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అనుయాయులు దొంగ ఓట్లకు చేసిన ప్రయత్నంను అడ్డుకొని స్వతంత్ర అభ్యర్థి ప్రశ్నించడంతో అక్కడ కాంగ్రెస్ వర్గీయులు భౌతిక దాడులకు పాల్పడటం, పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టడం, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే పోలింగ్ బూత్‌ల ముందు నిల్చొని ఓటర్లను బతిమిలాడటం ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ చౌరస్తా వేదికగా రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవడం వినిపించింది.
పోలింగ్ కు ముందు రోజు రాత్రి కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని డివిజన్లలో ఓటర్లకు ఒక్కో ఓటుకు రూ.2వేలకు పంచినప్పటికీ ఓటర్ల మద్దతు ఎందుకు కూడగట్టుకోలేక పోయారన్నదే చర్చనీయాంశమైంది. బుధవారం జరిగిన పోలింగ్‌లో 1,79,624 ఓట్లకు గానూ 1,23,,616 ఓట్లు పోలు కాగా, 68.82 శాతం నమోదైంది. కాగా, నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ పట్టణాల్లో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, రిటైర్డు కార్మిక కుటుంబాల ఓట్లు దాదాపు 40వేల వరకు ఉంటాయి. కార్మిక కుటుంబాల ప్రాధాన్యత ఓట్లు అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకే పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా నగరంలో ఇదివరకు జరిగిన కూల్చివేతలు, దారి మైసమ్మ గుళ్ల విధ్వంసాల సంఘటనలు కూడా కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. ఈ కారణంగా కూడా మెజార్టీ రాబట్టుకోలేక పోయినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి వార్ వన్ సైడ్ జరగడం గమనార్హం. చాలా చోట్ల కాంగ్రెస్ కు బీఆర్ఎస్, ఏఐఎఫ్ బి నుంచే గట్టి పోటీ తట్టుకోవాల్సి వచ్చింది. ఏదిఏమైనా గురువారం జరిగే ఓట్ల లెక్కింపు కోసం అభ్యర్థుల కంటే ప్రజానీకమే ఆతృతగా ఎదురు చూస్తుండటం విశేషం.