BC reservation bill | కోరుట్ల, జూలై 30: బీసీ రిజర్వేషన్ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకు కపట నాటకానికి తెరతీసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటనలు చేయడం మసిపూసి మారేడు కాయ చేయడమేనన్నారు. 42 శాతం రిజర్వేషన్లలో మైనార్టీలకు 10 శాతం వాటా కల్పించడాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అమోదించదన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కుంటి సాకులు చెబుతూ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేయాలని చూస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిందో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హమీలకు నిరసనగా ఆగస్ట్ 2న హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీలు అధిక సంఖ్యలో హజరై ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పార్టీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ పట్టణాధ్యక్షుడు బింగి వెంకటేష్, నాయకులు గుంటుక సదాశివ్, మాడవేణి నరేష్, పెండెం గణేష్, చిరుమల్ల ధనుంజయ్, కంఠం ఉదయ్, ఎర్ర రాజేందర్, తిరుమల వాసు, బెక్కెం అశోక్, మైదం సత్యనారాయణ, గెల్లె నర్సయ్య, కోడూరి రమణ, ఉప్పులూట్ రాఘవులు, రాజరాపు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.