Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 11 : దళితుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని వేములవాడ నియోజకవర్గంలో దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ మండిపడ్డారు. వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు చేసిన వ్యాఖ్యలను వారు ఖండించి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే విద్యార్థులకు గురుకులాల విద్య, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా సాక్షాత్తు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, హైదరాబాద్ రాజధాని నడిబొడ్డులో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి గౌరవాన్ని కల్పించారాని అన్నారు.
వేములవాడ నియోజకవర్గంలో దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మర్రిపల్లి గ్రామంలో దళితుల భూములను లాక్కోవాలని చూస్తున్న ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మన వైపు చందుర్తి లో దళిత బిడ్డ అశోక్ పై కక్ష సాధింపు చర్యలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వేములవాడ లాంటి మున్సిపల్ పాలకవర్గ పదవిలో దళితునికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. నూకాలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎందుకు దళిత సర్పంచిని ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఇలా అన్ని విధాలుగా నియోజకవర్గంలో దళితులపై కక్ష సాధింపు జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దళితులను మాత్రం రాజకీయంగా వాడుకుంటూ ఎదగాలని చూస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో సర్పంచ్ నరేష్, మాజీ సర్పంచ్ సుమన్, అంజి, తదితరులు ఉన్నారు.