గణతంత్ర దినోత్సవం రోజు నాలుగు పథకాలను ప్రారంభిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం, అమలులో యూటర్న్ తీసుకున్నది. మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి, అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఆ గ్రామాల ఎంపిక, జాబితాల వడపోత అధికారులకు తలనొప్పిగా మారింది. రాత్రికి రాత్రే లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డుల పేరిట నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. అందకు అనుగుణంగా అధికారులతో సర్వేలు చేయించింది. అంతే కాకుండా ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించింది. అధికారులు ఆయా గ్రామసభల్లో అర్హుల జాబితాను కూడా ప్రదర్శించారు. అయితే, ప్రతి గ్రామసభలో అర్హులను ఎంపిక చేయలేదని నిరసనలు వ్యక్తం కాగా, అధికారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దాంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 26 నుంచి పథకాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పిన నేపథ్యంలో అన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు ఒకేసారి లబ్ధి జరుగుతుందని అందరు భావించారు. కానీ, ప్రభుత్వం ఈ విషయంలో తన నిర్ణయా న్ని మార్చుకున్నది.
ఇప్పుడు మండలానికి ఒక గ్రామా న్ని మాత్రమే ఎంపిక చేసి, నాలుగు పథకాలను అమ లు చేసేందుకు సిద్ధమై ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి, మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. సమయం సరిపోకపోవడంతో శనివారం రాత్రి ఇంటింటా తిరుగుతూ సర్వే చేశారు. శనివారం రాత్రి జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల రూరల్ మండలం కండ్లపెల్లి, మేడిపల్లి మండలం గుండ్లపల్లిలో సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే వివరాలను, జాబితాలను పరిశీలించారు. అయితే కొన్నిచోట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లలో కూర్చొని అధికారులు సర్వేను మమ అనిపించినట్టు తెలుస్తున్నది.