ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ రుసుముకు సర్కారు ఎగనామం పెడుతున్నది. ‘పరీక్షల విధులు నిర్వర్తించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించి పనులు చేయించుకుని, తీరా.. పేపర్లు దిద్దిన జూనియర్ లెక్చరర్లకు మొండిచేయి చూపుతున్నది. ఇప్పటికే గతేడాది పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించి డబ్బులు ఇవ్వకపోగా, ఈ యేడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల విధులు, మూల్యాంకనం డబ్బులు పెండింగ్‌లో పెట్టింది. మూడు నెలలైనా ఇప్పటికీ రూపాయి కూడా రాకపోవడంతో సార్లు మండిపడుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి రూ.15వేల నుంచి రూ.25వేలు రావాల్సి ఉందని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
జగిత్యాల, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పత్రాలు దిద్దిన సార్లకు సర్కారు డబ్బులు ఇవ్వడం లేదు. పరీక్షల విధులు సక్రమంగా నిర్వర్తించి, అవకతవకలు లేకుండా చూడాలని చెబుతూనే, ఎర్రని ఎండలో ఒత్తిడి మధ్య మూల్యాంకనం చేసిన వారికి న్యాయంగా ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌కు ఎగనామం పెడుతుండగా, లెక్చరర్లు మండిపడుతున్నారు.
ఇంటర్మీడియెట్‌కు సంబంధించి ప్రాక్టికల్, థియరీగా రెండు పరీక్షలు ఉంటాయి. ఈ ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి విధులు నిర్వర్తించే ప్రతి ఒక్క బాధ్యుడికి ఇంటర్మీడియెట్ రెమ్యునరేషన్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెమ్యునరేషన్ కోసం ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసే విద్యార్థుల వద్ద నుంచి పరీక్ష రుసుంను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ (రోజుకు రూ.352), డిపార్ట్మెంట్ ఆఫీసర్ (రోజుకు రూ.313), స్కిల్డ్ అసిస్టెంట్ (రోజుకు రూ.188) స్టోర్ కీపర్, ల్యాబ్ అటెండర్, వాటర్మెన్లకు (రోజుకు రూ.128) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రాక్టికల్ ఎగ్జామినర్‌కు సంబంధించి టీఏ, డీఏ (రోజుకు రూ.300) చెల్లించాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జామినర్ స్థానికంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో పనిచేస్తే, టీఏ,డీఏకు బదులుగా లోకల్ కన్వేయన్స్ కింద రోజుకు రూ.188 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రాక్టికల్ ఎగ్జామినర్‌కు మూల్యాంకనానికి ఒక్క జవాబు పత్రానికి రూ.23.66 పైసలను చెల్లిస్తారు. ఇక థియరీ పరీక్షలకు సంబంధించి పెద్ద తతంగమే ఉంటుంది.
థియరీ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు రోజుకు రూ.352, డిపార్ట్మెంట్ అధికారికి రూ.313, ఇన్విజిలేటర్‌కు రోజుకు రూ.188, క్లర్క్‌కు రూ.156, అటెండర్, స్వీపర్లకు రోజుకు రూ.128 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీరు కాకుండా సిట్టింగ్ స్కాడ్, ఫ్లయింగ్ స్కాడ్, డెక్ మెంబర్స్, హైపవర్ కమిటీ మెంబర్స్, డీఆర్డీసీ సభ్యులకు సైతం రోజు వారీగా రెమ్యునరేషన్ చెల్లించాలి. మూల్యాంకనానికి సంబంధించి, క్యాంప్ ఆఫీసర్‌తో పాటు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు, చీఫ్ ఎగ్జామినర్లకు రోజుకు రూ.800 రెమ్యునరేషన్ ఇవ్వాలి. మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు సంబంధించి ఒక్కో జవాబు పత్రానికి రూ.23.66 పైసలు చెల్లించాలి. ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను స్క్రూటినైజర్ పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఒక్క జవాబు పత్రాన్ని పరిశీలించినందుకు రూ. 4.60 ఇవ్వాలి. ఒక్క స్క్రుటినైజర్ రోజుకు రూ.690 చెల్లించాల్సి ఉంటుంది.
మూల్యాంకనం చేసే లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్‌కు సైతం ప్రతి రోజు డీఏ, టీఏ చెల్లించాల్సి ఉంటుంది. మూల్యాంకనం కేంద్రానికి యాభై కిలోమీటర్లకు పైబడిన కాలేజీ నుంచి విధులకు వచ్చే లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్‌కు ప్రతి రోజు అవుట్ స్టేషన్ అలవెన్స్ కింద రూ.703 చెల్లించాలి. ఇక యాభై కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న కాలేజీ నుంచి విధులకు హాజరయ్యే వారికి డీఏ కింద రోజుకు రూ.300 చెల్లిస్తారు. ముల్యాంకన కేంద్రం ఉన్న పట్టణంలోను, లేదా 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కాలేజీల నుంచి విధులకు హజరయ్యే వారికి లోకల్ కన్వేయన్స్ కింద రూ.188 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఇంటర్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు, మూల్యాంకనంలో పాల్గొనే ప్రతి ఉద్యోగికి ప్రత్యేక రెమ్యునరేషన్ ఇస్తుంటారు.
ఇంటర్, పదో తరగతి పరీక్షలు, జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి చెల్లించాల్సిన రెమ్యునరేషన్లు సరిగా అందడం లేదు. గతంలో ఇంటర్ పరీక్షలు ముగిసిన రోజే సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు, డెక్ అధికారులు, లెక్చరర్లు, ఇతర బోధనేతర సిబ్బందికి డబ్బులు నేరుగా చేతికి అందించి దానికి సంబంధించి వర్క్‌డన్ పత్రంపై రెవెన్యూ స్టాంప్‌తో సంతకం తీసుకొని ఇంటర్ బోర్డుకు పంపించేవారు. పరీక్షలు నిర్వహించి, విధుల నుంచి రిలీవ్ అవుతుండగానే నేరుగా డబ్బులు లెక్చరర్ల చేతికి, టీచర్ల చేతికి అందేవి. అలాగే జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి సైతం అదే పద్ధతిని ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు అనుసరించేవి. మూల్యాంకనం ప్రారంభమైన తర్వాత మూడు నాలుగు రోజులకు లెక్చరర్లకు అడ్వాన్స్‌లు సైతం ఇచ్చేవారు. వాల్యుయేషన్ పూర్తయిన చివరి రోజు లెక్చరర్లు, టీచర్లు చేసిన పనిరోజులు, దిద్దిన పేపర్ల సంఖ్యను లెక్కించి రెమ్యునరేషన్‌ను లెక్క కట్టి ఇచ్చేవారు.
ఈ క్రమంలో మూల్యాంకనమైనా, పరీక్షల విధులనైనా చేసేందుకు లెక్చరర్లు, టీచర్లు సంతోషించే వారు, ఉత్సాహంగా ముందుకు వచ్చేవారు. అయితే, గత విద్యా సంవత్సరం నుంచి పరిస్థితి మారిపోయింది. ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు పరీక్షలు, మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యునరేషన్లను స్పాట్లో ఇవ్వడం లేదు. లెక్చరర్లు, టీచర్లు చేసిన విధులను లెక్కించి వారికి ఎంత రెమ్యునరేషన్ వస్తుందో వర్క్‌డన్ పత్రాలు చేసి, వారితో సంతకం తీసుకొని అకౌంట్లలో వేస్తామని పంపించేస్తున్నారు. ఇది పెద్ద సమస్యగా మారింది. గతేడాది ఇంటర్ పరీక్ష, మూల్యాంకనం విధుల రెమ్యునరేషన్ ఆరు నెలల తర్వాత బ్యాంకులో జమ చేసామన్న అధికారులు, ఒకొక్క లెక్చరర్‌కు సంబంధించిన రెమ్యునరేషన్ నుంచి 20 శాతాన్ని టీడీఎస్ కింద కోత విధించారు. ఇదేంటని ప్రశ్నించిన లెక్చరర్లకు ‘ ఈ 20 శాతం డబ్బులు మళ్లీ మీ అకౌంట్లలో పడతాయని’ చెప్పారు. అయితే ఏడాది గడిచిపోయినా కోత విధించిన ఇరవై శాతం రెమ్యునరేషన్ లెక్చరర్లకు అందలేదు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మూడు నాలుగు ఫేజుల్లో పరీక్షలు ముగించగా, ప్రాక్టికల్స్‌కు సంబంధించిన పారితోషికం ఇంత వరకు లెక్చరర్లకు అందలేదు. తర్వాత మార్చిలో థియరీ పరీక్షలు జరిగాయి. వీటి మూల్యాంకనం మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగింది. ముల్యాంకనం రుసుం మూడు నెలలు గడిచినా ఇవ్వకుండా సతాయించి, చివరకు జూన్‌లో చెల్లించారు. మే నెలలో అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించిన ఇంటర్ బోర్డు, ఇంత వరకు పరీక్షలకు సంబంధించిన పారితోషికం, మూల్యాంకనం పారితోషికం చెల్లించకపోవడంతో లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం గమనార్హం. కాగా, ఒక్కో లెక్చరర్, ప్రిన్సిపాల్‌కు కనీసం రూ.15వేల నుంచి రూ.25 వేల దాకా రెమ్యునరేషన్ రావాల్సి ఉందని, ఇంకెప్పుడిస్తారని వ్యాఖ్యానిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో ఏడాదిన్నర కింద పదో తరగతి జవాబు పత్రాలు దిద్దిన టీచర్లకు రెమ్యునరేషన్ ఇప్పటికీ రాలేదు. ఏమైందో..? ఏమో..? గానీ రాష్ట్రంలోని అన్ని పదో తరగతి మూల్యాంకన కేంద్రాలకు రెమ్యునరేషన్ మంజూరు చేసిన ఎస్సెస్సీ బోర్డు జగిత్యాల మూల్యాంకన కేంద్రంలో పనిచేసిన వారికి మాత్రం మంజూరు చేయలేదు. వందలాది మంది టీచర్లకు, అధికారులకు వేలాది రూపాయల రెమ్యునరేషన్ అందకుండా పోయింది.