జగిత్యాల, జూన్ 20 (నమస్తే తెలంగాణ): “రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెపం నెట్టి పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. పోరాటం తప్పదు. రైతులు ధైర్యంగా ఉండాలి. మీకు బీఆర్ఎస్తోపాటు కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉంటారు” అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి భరోసా కల్పించారు. రాష్ట్రంలో రైతులు తిరిగి తలెత్తుకు బతకాలన్నా, వారి కనీస అవసరాలు తీరాలన్నా, కేసీఆర్ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం ఎంత మేరకు కొనుగోలు చేస్తుందో రాష్ట్ర సర్కారు అంతే మొత్తంలో కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించిన అసంబద్ధ విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జగిత్యాలలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర వివక్షకు గురవుతున్నారని, రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తామని అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి, అసలుకే ఎసరు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు వరిలో ఏ రకం ధాన్యానికైనా రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, తీరా ఎన్నికల తర్వాత కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ అంటూ ప్రకటించి రైతులను నిండా ముంచారని దుయ్యబట్టారు. ఇటీవల ఏడు రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని రేవంత్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. “మార్కెట్లో డిమాండ్ ఉన్న ధాన్యాన్ని పండిస్తే ప్రభుత్వం బోనస్ ఇవ్వడం ఏంటి..? ఇది అర్థం లేని నిర్ణయం. బోనస్‌ను ఎగ్గొట్టే కుట్ర” అని మండిపడ్డారు.
ఇవ్వన్నింటి కంటే ఈ వానాకాలం పంటను క్రాప్ హాలిడేగా ప్రకటించి, రైతులకు ఎకరానికి రూ.20, రూ.25వేలు ఇస్తే నయమన్నారు. రేవంత్ దిక్కుమాలిన పాలన చూసి మేఘాలు సైతం ముఖం చాటేస్తున్నాయని, కరువు పరిస్థితులు మొదలవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. రైతులకు చేసిన మేలులో కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తే, రేవంత్‌రెడ్డి రైతుల వ్యవహారంలో లాభ నష్టాలను లెక్కిస్తున్నారన్నారు. ఇక్కడ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కటుకం రవీందర్, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గాజుల రాజేందర్, కల్లేపల్లి దుర్గయ్య, రమేశ్, రాధాకిషన్, మహిపాల్, మల్లేశ్, శీలం సురేందర్, అబ్దుల్ భారీ, తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారు. నాలుగు దశాబ్దాలుగా రైతులకు అండగా నిలిచిన జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగానే పార్టీని వీడారంటే, ప్రభుత్వ పనితీరు ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతు పండించిన పంటలను కొనుగోలు చేయమని, తాము చెప్పిన పంటలు మాత్రం సాగు చేయాలన్న ప్రభుత్వ తీరు పూర్తిగా ఆక్షేపనీయం. బీఆర్ఎస్ పక్షాన రైతు తరఫున ఈ నిర్ణయాన్ని ఎండగడుతాం. రైతు బీమా కింద చెల్లించాల్సిన ప్రీమియాన్ని ఎగవేసింది. ఈ విషయమై మాజీమంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే కేసులు నమోదు చేశారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.
– ఎమ్మెల్సీ ఎల్మ్రణ
ఇది రైతు వంచక ప్రభుత్వం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రైతును రాజుగా మార్చేందుకు కృషిచేసి, దేశానికి వెన్నెముక అనే మాటలను నిజం చేస్తే, రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు వచ్చి వెన్నుపోటు పొడుస్తున్నది. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం పంట కొనుగోలు చేస్తామని ప్రకటించి, ఇప్పుడు కేంద్రం అనుమతించిన మేరకే ధాన్యాన్ని కొంటామని ప్రకటించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో 45 లక్షల ఎకరాలకు నీరందిస్తే, రేవంత్ రెడ్డి రైతు డిసం పేరిట 24 గంటల విద్యుత్‌కు తూట్లు పొడుస్తున్నారు.
– జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
గంగాధర/ చొప్పదండి, జూన్ 20: ‘ఎన్నికలకు ముందు రైతు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొన్నటిదాకా కొనుగోళ్లలో అనేక కొర్రీలు పెట్టి రైతును ముంచింది. ఇప్పుడు కేంద్రం కేటాయించిన కోటా మేరకే కొంటామని చెబుతున్నది. రైతుల పొట్టకొట్టాలని చూస్తే ఊరుకోం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గింజా కొనాలి” అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. శనివారం మధురానగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకొని అన్నదాత బతుకులను రోడ్డున పడేయడం, దిక్కులేనివారిగా చేయడం సరికాదని హితవుపలికారు. రైతును రాజుగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలూ కృషిచేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకుంటే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు మేచినేని నవీన్‌రావు, సాగి మహిపాల్‌రావు, కంకణాల విజేందర్‌రెడ్డి, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పులి వెంకటేశ్‌గౌడ్, వేముల దామోదర్, రామిడి సురేందర్, శ్రీమల్ల మేఘరాజు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి, జూన్ 20: మొదట 33 రకాల సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి.. తీరా సమయానికి కేవలం ఏడు రకాల వడ్లకే వర్తిస్తుందని చెప్పడం దగా చేయడమేనని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టారని.. రైతుబీమా బంద్ చేశారని.. సన్న వడ్లకు బోనస్ బోగస్ అయిందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు. అన్నదాతపై రేవంత్ సర్కారు సవిత తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. అన్నంపెట్టే అన్నదాతను ఆగమాగం చేస్తూ.. రేవంత్‌రెడ్డి సర్కారు రాక్షసానందం పొందుతుందని ఆగ్రహించారు. ఈ మేరకు శనివారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతులు పండించిన పంట కొనుగోలు చేయమని, కేంద్రం చెప్పినంతే కొంటామని సాక్షాత్తూ సీఎం ప్రకటించడంపై రాష్ట్ర రైతాంగం మండిపడుతున్నదన్నారు. గతంలోనూ ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టినా.. రూ.10వేల కోట్లు కేటాయించి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చివరి గింజ వరకు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుందని.. రాష్ట్రంలో 90శాతం వరి సాగు అవుతుందని, మరి వరి ధాన్యం కొనకుంటే ఎట్లా? అనే విషయం చెప్పాలని డిమాండ్ చేశారు. రోహిణీ కార్తెలోనే నారు పోసుకున్న రైతుల పరిస్థితి ఏమిటన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండబోతోందని, రాష్ట్ర సర్కారు త్వరగా మేల్కొని కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి ఎత్తిపోతలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మార్కు లక్ష్మణ్, నూనేటి సంపత్, మోహన్‌రావు, సందీప్‌రావు, వెన్నం రవీందర్, పెంచాల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, మొబిన్, సలేంద్ర రాములు, నర్ల అంజయ్య, గుణపతి, జుబేర్, తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని, జూన్ 20: రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రైతును రాజును చేస్తే.. కాంగ్రెస్ పాలనలో రేవంత్‌రెడ్డి అరిగోస పెడుతున్నాడని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. రైతు సంక్షేమమని గొప్పలు చెప్పుకొంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు పంటల కొనుగోళ్లలో చేతులెత్తేయడం దారుణమన్నారు. కేంద్ర నిర్ధేశించిన లక్ష్యాలకు మించి పండినా కొనుగోలు చేయమని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. పంటల కొనుగోలు బాధ్యతను కేంద్రంపై నెట్టివేయడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇవ్వకుంటే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, మూల విజయారెడ్డి, పద్మ, మేకల సమ్మయ్య, మెతుకు దేవరాజు, బొడ్డు రవీందర్, తోకల రమేశ్, నీరటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మానకొండూర్, జూన్ 20: రేవంత్ సర్కార్ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి రైతుల ఉసురు తీస్తున్నదని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మానకొండూర్‌లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో అన్ని రకాల పంట ఉత్పత్తులతో దేశానికే ‘ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా నిలిచి అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రం నేడు రేవంత్ పాలనతో అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం మూడుసార్లు ఎగ్గొట్టారని, రైతుబీమాకు కనీసం ప్రీమియం చెల్లించలేదని మండిపడ్డారు. ఫలితంగా ఈరోజు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి రాష్ట్రవ్యాప్తంగా 7600 రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ధ్వజమెత్తారు. కేంద్రం కోటా ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉందని, అట్లయితే మీరు అధికారంలో ఉండడం ఎందుకు అని, ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రతి గింజా మద్దతు ధరతో కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు గంట మహిపాల్, మహిపాల్‌రెడ్డి, గంప వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.
కొత్తపల్లి జూన్ 20 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. అయితే చికిత్స, ఔషధాల ద్వారా నయంకాని కొన్ని వ్యాధులు యోగా చేయడం ద్వారా తగ్గుతున్నాయని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, చెడు వ్యసనాలకు దూరం కావొచ్చని సూచిస్తున్నారు. యోగాలో కొన్ని ఆసనాలు వేస్తే మానసిక ఒత్తిడి దూరమై, మంచి ఫలితాలను సాధిస్తామని చెబుతున్నారు. యోగాకు మన దేశం పుట్టిల్లు అని.. ప్రస్తుతం 193దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని తెలిపారు. నేడు ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోనున్నారు.