కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 16 : కాంగ్రెస్ చేసే బెదిరింపులకు భయపడేది లేదని, కక్షపూరిత, కుట్ర పూరిత కేసులకు బీఆర్ఎస్ నాయకులెవరూ బెదరరని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. పిచ్చి వేషాలు చేస్తే ప్రజలు ఉరికించి కొడుతారని హెచ్చరించారు. ఫార్ములా ఈ-రేసులో అసలు అవినీతి జరుగనప్పుడు కేసులు ఎలా పెడుతారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను ఏమీ అమలు చేయకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా కేటీఆర్‌ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు.
కేటీఆర్‌ను జైలుకు పంపించాలన్న కుట్రతోనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. చిల్లర చేష్టలతో బీఆర్ఎస్ను ఏమీ చేయలేరన్నారు. కాంగ్రెస్ 13 నెలల పాలనలో కక్ష పూరిత, కుట్ర పూరిత కేసులు తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కాంగ్రెస్‌ను ప్రజల్లో నిలదీస్తామన్నారు. తమ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేను ఏ పార్టీలో ఉన్నావని అడిగినందుకే కేసులు పెడుతారా? అని ప్రశ్నించారు. చొప్పదండి ఎమ్మెల్యే స్థాయి మరిచి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని దద్దమ్మ అని, ఆయనకు కేటీఆర్‌ను విమర్శించే స్థాయిలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక్కరిని ముట్టుకున్నా వీపు విమానం మోగిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో అక్రమ దందాలు, కమీషన్లు వసూలు చేయడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులను కూడా పోలీసులను పెట్టుకొని పంచే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. ఈ నెల 20లోగా నారాయణపూర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలని, లేకపోతే గంగాధర చౌరాస్తాలో భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఓ పక్క పొలాలు ఎండిపోతుంటే నీళ్లు ఇచ్చామని తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు.